ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు విపక్ష నేతల్ని బూతులు తిట్టడం కామనే కానీ ఇప్పుడు మంత్రులు స్థాయి నేతులు మరో అడుగు ముందుకేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును “తీవ్రవాది” అనేయడం ప్రారంభింంచారు. చంద్రబాబు… కరోనా వ్యాప్తి విషయంలో ఏపీ సర్కార్ కీలక విషయాలు దాచి పెడుతోందని… విమర్శలు చేశారు. నాలుగురోజులుగా ఎన్ని టెస్టులు చేస్తున్నారో.. ఎంత మంది శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయో లాంటి విషయాలను ఏపీ సర్కార్ బయటపెట్టడం లేదు. అలాగే.. కరోనా అనుమానిత లక్షణాలతో మరణించినప్పటికీ.. సాధారణ మరణాలుగా సర్టిఫై చేస్తున్నారు. దీనిపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ప్రజారోగ్యంతో ఆడుకోవడమేనని.. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. వైసీపీ నేతలు… రూ. వెయ్యి పంపిణీ చేయడంపైనా… పేద కుటుంబానికి రూ. ఐదు వేలు ఇవ్వాలన్న డిమాండ్‌ను చంద్రబాబు వినిపించారు.
చంద్రబాబు అలా ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించగానే.. ఇలా మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తీవ్రవాదిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తీవ్రవాదులు పక్క దేశాల్లో ఉండి మన దేశ విధ్వంసం కోసం పని చేస్తారని.. ఇప్పుడు చంద్రబాబు కూడా పొరుగు రాష్ట్రంలో ఉండి.. ఏపీ విధ్వంసం కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడాన్ని పేర్ని నాని.. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంగా అభివర్ణించారు. టెస్టుల సంఖ్యను బయటపెట్టాల్సిన అవసరం ఏముందని.. ప్రజలను ఆందోళనకు గురి కాకుండా ప్రభుత్వం చూసుకుంటోందన్నారు. కరోనా విషయంలో.. చంద్రబాబు చేసిన విమర్శలకు పేర్ని నాని.. తిట్లతో ఎదురుదాడి చేశారు కానీ.. క్లారిటీ ఇవ్వలేకపోయారు.
కరోనా విషయంలో ఏపీ సర్కార్ శాఖల మధ్య… సమన్వయం కొరవడిందని విపక్ష పార్టీలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా… ఇవే తరహా ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు నిజాలు చెప్పడం లేదని.. అనేక అంశాలను దాచి పెడుతోందని మండిపడుతున్నారు. టెస్టులు వేగంగా ఎందుకు చేయడం లేదనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. దీనిపై వైసీపీ నేతలు… తిట్లతో ఎదురుదాడి చేస్తున్నారు కానీ.. ప్రజలకు భరోసా ఇచ్చేలా సమాధానం ఇవ్వలేకపోతున్నారు.