ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవడం, సమీక్షించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బాగా అలవాటు అని అంటుంటారు! ఆ నివేదికల ఆధారంగా చర్యలూ క్లాసులూ ఉంటుంటాయి. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉద్యోగుల మీద ప్రయోగించేందుకు ఏపీ సర్కారు సిద్ధమౌతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజానికి, ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును అరవై సంవత్సరాలకు పెంచింది చంద్రబాబు నాయుడే! దీంతో ఉద్యోగులంతా ఫుల్ దిల్ ఖుష్ అయ్యారు. కానీ, త్వరలోనే పనితీరు, నిబద్ధత వంటి రకరకాల నియమ నిబంధనల పేరుతో ఉద్యోగుల మెడలపై కొత్త కత్తి పెట్టబోతున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఉన్నట్టుండి ముఖ్యమంత్రి దృష్టి వారిపై ఎందుకు పడిందంటే దానికో కారణం ఉన్నట్టు తెలుస్తోంది.
హోం శాఖకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలను తయారు చేసి క్యాబినెట్ ముందు పెట్టాలని ఉద్యోగులకు చంద్రబాబు ఈ మధ్య ఆదేశించారట. అయితే, సీఎం చెప్పిన సమయానికి ఆ ఫైల్ రెడీ కాలేదనీ, క్యాబినెట్ ముందు రాలేదని తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయిపోయారనీ, దీంతో ప్రభుత్వోద్యోగుల పనితీరు సమీక్షించేందుకు కొన్ని నిబంధనలు రెడీ చేయమని చెప్పినట్టు చెబుతున్నారు. యాభయ్యేళ్లు పైబడిన ఉద్యోగుల పనితీరునే ముందుగా సమీక్షిస్తారని తెలుస్తోంది. వారి నిబద్ధత, పనితీరును పరిశీలించి.. సర్వీసులో కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా నిర్ణయిస్తారని అంటున్నారు. పనితీరు బాగులేదని తేలితే ఆ ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించేందుకు అనువుగా నిబంధనలు రెడీ చేసినట్టు చెబుతున్నారు.
ఈ విషయంపై చర్చ మొదలవగానే ఉద్యోగాల సంఘాల ప్రతినిధులు కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులను కలుసుకున్నారట. త్వరలో రాబోతున్న ఈ నిబంధనలపై ఆరా తీయగా.. అలాంటివి ఏవీ లేవని ఉన్నతాధికారులు చెప్పి పంపించారట. అయితే, ఈ నిబంధనల విషయమై తెర వెనక జరగాల్సినవన్నీ జరుగుతున్నాయనీ, ఈ ప్రపోజల్ విషయమై న్యాయ సలహాలను కూడా ప్రభుత్వం తీసుకుందనీ, సాధారణ పరిపాలన శాఖ నుంచి వీటికి అనుమతులు లభించాయని వినిపిస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు వీటిని అమల్లో పెట్టకపోయినా.. త్వరలోనే కొత్త నిబంధనల ప్రయోగం తప్పదని తెలుస్తోంది. నిజానికి, చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగులను రాచి రంపాన పెడతారనే విమర్శ ఎప్పట్నుంచో ఉన్నదే. గడచిన ఎన్నికల తరువాత మారానని నిరూపించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, ఇప్పుడు ఇలాంటి కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తే.. ముఖ్యంగా యాభైయేళ్లు దాటిన ఉద్యోగులను టార్గెట్ చేసుకుంటే మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగుల పనితీరును మెరుగు పరచాలనుకోవడం మంచి ఆలోచనే, కానీ ఆ పేరుతో ఎలా వేటు వెయ్యొచ్చో అనే ఆలోచనతో చంద్రబాబు సర్కారు ఉంటే.. మళ్లీ పాత రోజులు వచ్చేస్తున్నట్టే..!