తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు.. ప్రస్తుతం గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులకు ఇంకా అసంతృప్తి చల్లారలేదు. తాను కోరుకున్నది లభించలేదన్న అసంతృప్తితోనే ఉన్నారు. అప్పుడప్పుడూ.. సుబ్రహ్మణ్య స్వామి.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రభుత్వం చేతుల్లోనుంచి బయటపడేలా చేస్తానని చేసే ట్వీట్లకు.. రీ ట్వీట్లు చేస్తూ.. సంకేతాలు పంపుతూ ఉంటారు. తాజాగా.. మరోసారి జగన్ చెప్పినా చేయడం లేదని.. అధికారులపై విరుచుకుపడ్డారు. ఆ అధికారులు చంద్రబాబు మాటలే వింటున్నారని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించేశారు. జగన్ చెప్పినా అధికారులు చేయలేదని రమణదీక్షితులు భావిస్తున్నది.. శపారపర్య అర్చకులను విధుల్లోకి తీసుకోవడం.
గతంలో ప్రధాన అర్చకులుగా ఉన్న సమయంలో రమణదీక్షితులు.. ఓ వ్యూహం ప్రకారం.. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వంచి చోట్ల ప్రెస్మీట్లు పెట్టి.. పింక్ డైమండ్లనీ… పోటులో తవ్వకాలని.. రాజకీయ నేతల మాదిరి ఆరోపణలు చేశారు. వాటిని పట్టుకుని.. వైసీపీ… బీజేపీ చేయాల్సినంత రాజకీయం చేశాయి. దీంతో… ఆగ్రహం చెందిన అప్పటి ప్రభుత్వం తిరుమలలో పాతుకుపోయిన వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ ఇచ్చేసింది. వారి కుటుంబసభ్యులనే వారి స్థానాల్లో నియమించింది. అప్పటి నుంచి మరింతగా చెలరేగిపోయి విమర్శలు చేసిన రమణదీక్షితులు.. తన పదవి తనకు వస్తుందని అనుకున్నారు. కానీ కోర్టు కేసుల వల్ల… ఆయనకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి మాత్రమే ఇచ్చారు. ఆ పదవి ఆయన ఆలయంలో పెత్తనం చేయడానికి సరిపోవడం లేదు.
జగన్మోహన్ రెడ్డి కూడా.. ఈ విషయం ఏమీ చేయలేకపోవడంతో.. రమణదీక్షితులకు పదవి ఉందనే కానీ.. ఆయన మాట చెల్లుబాటు కాని పరిస్థితి ఉంది. అందుకే.. అప్పుడప్పుడూ.. తన అసంతృప్తిని ఆయన వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు.. అధికారులపై ఒత్తిడి పెంచేలా.. చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని… రాజకీయ నాయకుని తరహాలో ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు మాట వినే అధికారులందరికీ.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే.. శంకరగిరి మాన్యాలు పట్టాయి. అయినా రమణదీక్షితులు అదే వ్యూహం ఎంచుకుని అధికారులపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని టీటీడీ వర్గాలు సెటైర్లు వేసుకుంటున్నాయి.