కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ప్రారంభం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో జరిగిన సభలో సీఎం మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా వేల ఎకరాల భూమిని రైతులు ఇచ్చి చరిత్ర సృష్టించారన్నారు. కానీ, కొంతమంది నాయకులు ఇక్కడ భూకంపాలు వస్తాయనీ, వరదలు వస్తాయనీ, రాజధాని మునిగిపోతుందని లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఈ మధ్య ఓ చిన్న వర్షం పడితే.. రాజధాని మునిగిపోయిందని కొందరు అన్నారనీ, వీళ్ల కలా ఆలోచనా రాజధాని మునిగిపోవాలని ఉందే తప్ప, బాగా కట్టాలనే ఆలోచన ఏకోశానా లేకపోవడం చాలా దురదృష్టకరం అన్నారు. భూమి రైతుల దగ్గరుందనీ, దాన్ని సి.ఆర్.డి.ఎ. తీసుకోవాలనీ, ఆ తరువాత ప్లాట్లు వెయ్యాలీ… జరగాల్సింది ఇంత స్పష్టంగా ప్రజల ముందు ఉంటే.. ఇక్కడేదో అవినీతి జరిగిపోయిందని కొందరు ఆరోపిస్తున్నారన్నారు. ఏదేమైనా, కొండవీటి వాగు వల్ల రాజధానికి ఎలాంటి ముప్పూ ఉండదన్నారు. ఇకపై వరద అనేదే ఉండదన్నారు.
బాబ్లీ అంశమై తనకు అరెస్టు వారెంట్ వచ్చిన అంశాన్ని మరోసారి ప్రస్థావిస్తూ… దీనిపై తమకు సంబంధం లేదని భాజపా అధ్యక్షుడు అమిత్ షా అంటున్నారన్నారు. ఈరోజున ఏ ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారంలో ఉందనీ, కేంద్రంలో ఎవరున్నారని చంద్రబాబు ప్రశ్నించారు? తాను ప్రజల కోసం నిరసన తెలిపాననీ, కాబట్టి భయపడాల్సిన పనిలేదన్నారు. దేశాన్ని దోచేసిన అవినీతిపరుల్ని విదేశాలకు పంపిస్తారనీ, ఇక్కడ అవినీతిపరులకు (జగన్ ను ఉద్దేశించి) అండగా నిలబడతారని అమిత్ షాని ఉద్దేశించి అన్నారు. ప్రజా సమస్యలపై తాను పోరాటం మొదలుపెట్టగానే… ఎప్పుడూ లేని అంశాలను ఇప్పుడు తనపైకి తీసుకొచ్చి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇంకా మాట్లాడాల్సిన విషయాలున్నాయనీ, అసెంబ్లీలో చెబుతానని చంద్రబాబు చెప్పారు.
నిజానికి, చంద్రబాబుకు జారీ అయిన సమన్లపై భాజపా నేతలు మాట్లాడకుండా ఉంటే కొంత బాగుండేది. ఎవ్వరూ అడక్కముందే వివరణ ఇచ్చే కార్యక్రమాలు వారే పెట్టేసుకుంటున్నారు. రెండ్రోజుల కిందట ఎంపీ జీవీఎల్ ప్రెస్ మీట్ పెట్టేసి… బాబ్లీ అంశమై కోర్టు స్పందిస్తే తమకేంటి సంబంధమన్నారు! ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అడగాలంటూ పురందేశ్వరి కూడా వ్యాఖ్యానించారు. నిన్న తెలంగాణ వచ్చిన అమిత్ షా కూడా మాకేంటి సంబంధం అంటున్నారు! మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది భాజపానే కదా. ఓరకంగా చూసుకుంటే… ఈ అంశం ఏపీలో భాజపాకి ఇబ్బందికరంగానే మారుతుందనడంలో సందేహం లేదు.