ఆంధ్ర ప్రదేశ్: తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య వ్యక్తిగత సంబంధాలు వ్యవస్థాగత వ్యవహారాలు బాగానే నడుస్తున్నాయని సమాచారం. ఇద్దరి మధ్య హాట్ లైన్ లేకపోయినా ‘చాట్లైన’్ వుందంటున్నారు సన్నిహితులు. తెలంగాణకు సంబంధించిన అంశం ఏదొచ్చినా ‘శేఖర్‌కు ఏమైనా ఒపీనియన్ వుందా?’ ‘శేఖర్ వద్దంటున్నాడా’ అని చంద్రబాబు నాయుడు తన తెలంగాణ కౌంటర్ పార్ట్ పాత మిత్రుడు కెసిఆర్ అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆఖరు దశలో టిఆర్ఎస్ ప్రవేశం చేసిన టిడిపి ఎంఎల్ఎలు ఒకరిద్దరు ఇందుకు సంధాన కర్తలుగా వుంటారు. మరీ అవసరమైతే నేరుగానే మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి లాటి నాయకులు అనవసరంగా లేక అవసరంగా ఆవేశపడటమే గాని తెలుగుదేశం అధినేత తెలంగాణలో పెద్దగా శ్రమపడొద్దని నిర్ణయానికి వచ్చేశారు. రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన ఓటుకు నోటు కేసుతో పాటు ఇంకా చాలా కారణాలున్నాయి. హైదరాబాదులో వ్యాపారాలు, స్నేహాలు బందుత్వాలు కొనసాగించుకోవడం తప్ప తెలంగాణలో రాజకీయ ఆశలు , వ్యూహాలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాక కెసిఆర్‌కు కూడా చంద్రబాబుతో వేరే పేచీ ఏమీ లేదు. అయితే దీని అర్థం రాష్ట్రాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలు కూడా సర్దుకుంటారని కాదు.వాటిపై ఎవరు తగ్గినా ఇద్దరికీ నష్టం. కాబట్టి వాటిపై వాదించుకుంటూనే వుంటారు.కొన్ని సమస్యలు ఎలాగూ మిగిలి వుంటాయి. వాటిని కాలానికి వదిలేసి సత్సంబంధాలు కొనసాగించాలనే ఇద్దరు సిఎంలు అనుకుంటున్నారు. ఈ దోస్తానా సమస్యల పరిష్కారానికి కూడా ఉపయోగిస్తే బావుంటుంది కదా! అలాగే అమాయకులూ అత్యాశాపరుల ఆవేశాలను తగ్గించినట్టూ అవుతుంది.