ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనాపరమైన అంశాల్లో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుండటంతో ఆ ఎఫెక్ట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చంద్రబాబు చకచక అడుగులు వేస్తుంటే రేవంత్ మాత్రం కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. చంద్రబాబును చూసి రేవంత్ నేర్చుకోవాలంటూ బీఆర్ఎస్ , బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఏపీతో పోలిస్తే ఆర్థికంగా తెలంగాణ మెరుగ్గానే ఉంది. అయినా, హామీల అమలు విషయంలో చంద్రబాబుతో పోలిస్తే రేవంత్ తేలిపోతున్నారు. ఆర్థికంగా ఏపీ నష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు రేవంత్ సర్కార్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. గతేడాది ఎన్నికల సమయంలో రేవంత్ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
పాలనా పరమైన విషయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉండటంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోగలరు. రేవంత్ మొదటిసారి ముఖ్యమంత్రి కావడంతో వ్యవస్థలపై పట్టు సాధించేందుకు కొంత సమయం పడుతుంది. పైగా ఆయన దూకుడుగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లేదు. ఎన్నో అడ్డంకుల్ని చేధించుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చంద్రబాబుకు అలాంటి పరిమితులు లేవు. రేవంత్ కు మాత్రం సీనియర్లతో పేచీ ఉంటుంది. ఆయన దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా అందరిని సమన్వయం చేసుకోవాల్సి ఉండటంతో రేవంత్ కు కొంత ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.
పాలనాపరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు చంద్రబాబుకు అన్ని సానుకూలతలే ఉండగా… రేవంత్ కు మాత్రం ప్రతికూలతలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన అన్నింటిని చక్కబెట్టుకుంటూ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ తెలంగాణ ప్రగతి రథాన్ని నడిపించాల్సి వస్తోంది. ఇలా చంద్రబాబు నిర్ణయాలు తెరమీదకు తీసుకొస్తూ రేవంత్ పై ఒత్తిడి పెంచుతున్నారు.