ఢిల్లీలో ఆదివారం నాడు నీతీ ఆయోగ్ సమావేశం జరనున్న సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరుగుతున్న భేటీ ఇది. ఈ భేటీకి ఏపీ సీఎం చంద్రబాబు హాజరౌతున్న సంగతీ తెలిసిందే, రాష్ట్ర సమస్యలతోపాటు కేంద్ర నిర్లక్ష్యాన్ని పెద్ద ఎత్తున ప్రస్థావించేందుకు ఆయన చేస్తున్న కసరత్తు కూడా తెలిసిందే. అయితే, పనిలోపనిగా తాజా ఢిల్లీ పర్యటనలో మరోసారి జాతీయ రాజకీయాలపై కూడా చంద్రబాబు కొన్ని కీలక భేటీల్లో పాల్గొనే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజానికి, నీతీ ఆయోగ్ సమావేశం అనగానే… దీని వెళ్లాలా వద్దా అనే అంశంపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చంద్రబాబు మాట్లాడినట్టు సమాచారం. ముఖ్యంగా భాజపాయేతర రాష్ట్రాల సీఎంలతోనే చంద్రబాబు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నీతీ ఆయోగ్ సమావేశాన్ని ఒక వేదికగా మార్చుకుని.. ఆయా రాష్ట్రాల సమస్యలతోపాటు, కేంద్రం వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదాతోపాటు, విభజన చట్టంలోని అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్థావించేందుకు చంద్రబాబు సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఢిల్లీకి వెళ్తున్న సీఎం.. భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతోపాటు, వివిధ జాతీయ పార్టీల నేతలతో కూడా చంద్రబాబు భేటీ అవుతారని కూడా అంటున్నారు. నిజానికి, బెంగళూరులో సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లొచ్చాక… జాతీయ రాజకీయాల గురించి చంద్రబాబు పెద్దగా మాట్లాడటం లేదు. అంతకుముందు, కేంద్రంపై టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో అన్ని పార్టీల నేతల్నీ కలుసుకుని, మద్దతు కూడగట్టారు.
ఇప్పుడు మరోసారి జాతీయ పార్టీల నేతలను ఢిల్లీలో కలుసుకునే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంటే, జాతీయ రాజకీయాలకు సంబంధించిన కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే భాజపాకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలనే ఉద్దేశంతో ఉన్నాయి. దాదాపు 400 ఎంపీ స్థానాల్లో భాజపాకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతుతో ఒకే అభ్యర్థిని పోటీకి దించాలనే ప్రణాళిక కూడా ఇటీవలే తెర మీదికి వచ్చిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలతో చంద్రబాబు నాయుడు భేటీ అంటూ జరిగితే… అది కీలకమైన పరిణామంగానే మారుతుంది.