కేంద్రం వద్దంటే పోలవరం నిర్మాణ బాధ్యతకు ఒక నమస్కారం పెట్టి తప్పకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటలలోనే ఆ వైఖరి మార్చుకున్నారు. దాన్ని ఎలాగైనా పూర్తిచేస్తామని అవసరమైతే కేంద్రంతో చర్చించి ఒప్పిస్తామని ప్రకటించారు. అందుకు తగినట్టే ప్రధానితోనూ సంబంధిత మంత్రి నితిన్ గడ్కరీతోనూ మాట్లాడేందుకు ఢిల్లీ బయిలుదేరారు. తర్వాత దక్షిణ కొరియాకు కూడా వెళతారు. అయితే ఢిల్లీలో ఆయన కలుసుకోవడం తప్ప ఇప్పటికిప్పుడు ఏదోస్పష్టత వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఏమైనా సర్దుబాటు వ్యాఖ్యలు చేస్తారేమో చూడాలి. మరోవైపున ప్రతిపక్ష వైసీపీ ఎంఎల్ఎలు ఎంపిలు ఈ నెల 7వ తేదీన పోలవరంకు బస్సు యాత్ర జరపాలని నిర్ణయించారు, అక్కడ పనులు ఏ మేరకు జరిగాయో పరిశీలించేందుకు పర్యటించవలసిందిగా అద్యక్షుడు జగన్ తమను ఆదేశించినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రెండు వారాల కిందటే ప్రభుత్వం తమ పార్టీ ఎంఎల్ఎలను బస్సులో పోలవరం తీసుకెళ్లి జరగిన అభివృద్ధిని చూపించింది. అప్పుడు ప్రస్తుతం తీవ్ర సవాళ్లుగా మారిన విషయాలు అప్పుడేమీ చెప్పింది లేదు. కాకుంటే దాన్ని ప్రచార యాత్రగా అందరూ పరిగణించారు. ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శ కోసం వెళుతున్న వైసీపీని అనుమతిస్తారా లేక మరో వివాదం రగులుతుందా అనేది అనుమానించాల్సిన విషయమే. ఎందుకంటే ప్రభుత్వం ఏదో సాంకేతిక సాకుతో పనులకు ఆటంకం అనో భద్రతా కారణాలనో చెప్పి వారికి అనుమతి నిరాకరించవచ్చు. లేదా లోగడ చంద్రబాబు బాబ్లీ పర్యటనకు వెళితే అడ్డుకున్నట్టు ఆడ్డుకోవచ్చు. అప్పుడు వివాదం ఇంకా ముదురుతుంది. అందుకే వారిని నిరాఘాటంగా వెళ్లి పరిశీలించిరావడానికి అనుమతించడం, సహకరించడం మంచిది.