కేంద్రంలో టీడీపీ చక్రం తిప్పడం ఖాయమైపోయింది. చంద్రబాబు కింగ్ మేకర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, విభజన తర్వాత పారిశ్రామికంగా వెనుకబడ్డ ఏపీని తిరిగి గాడిలో పెట్టాలనుకుంటున్న తరుణంలో టీడీపీ ఎన్ని మంత్రి పదవులు తీసుకుంటుంది? ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశంకు ఏయే మంత్రిత్వశాఖలు వస్తాయి? అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ప్రచారాలు ఎలా ఉన్నా… స్టేట్ ఫస్ట్ అనే నినాదంతోనే మనందరం పనిచేద్ధామని, గెలిచామని ఆకాశంలో ఎగురకుండా రాష్ట్రం కోసమే పనిచేయాలని చంద్రబాబు ఎంపీలతో కుండబద్ధలు కొట్టి, తన రూట్ ఏంటో చెప్పకనే చెప్పారు.
అయితే, ఎన్డీయే పక్షాలకు ఈ సారి ఎలాంటి మంత్రిత్వ శాఖలు కేటాయించాలన్న దానిపై కీలక నేత పీయూష్ గోయల్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ షా నివాసంలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో ఆర్.ఎస్.ఎస్ కీలక నేతలు భేటీ అయ్యారు.
బీజేపీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి నాలుగు ఎంపీ సీట్లకు ఒక మంత్రి పదవి తీసుకోవాలని…ఇదే ఫార్మూలతో మిత్రపక్షాలకు కూడా మంత్రిపదవులు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఏయే శాఖలు ఇవ్వాలన్న అంశంపై చర్చించాలని పీయూష్ గోయల్ బాధ్యతలు అప్పగిచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 16 సీట్లు ఉండగా… 4మంత్రి పదవులు రాబోతున్నాయి. వీటికి తోడు ఒకటి లేదా రెండు సహాయ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక కూటమిలో కీలకంగా ఉన్న జనసేనకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం.