తెలుగుదేశం పార్టీ మహానాడు.. అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోపన్యాసంలోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. తమ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోందో.. ప్రసంగం ద్వారా కార్యకర్తల్లో కి పంపేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని టార్గెట్ చేసుకుని… కేంద్రం పాలనాపరమైన వైఫల్యాలపై సూటిగా గురిపెట్టారు. రాజకీయంగా చేస్తున్న అవకతవకలనూ ప్రశ్నించారు. మోదీది ప్రచార ఆర్భాటం తప్ప.. మరేమీ లేదని తేల్చేశారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలను సక్రమంగా అమలు చేయకపోవడం దేశం చాలా తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఏ రంగంలోనూ మోదీ పని తీరు ఆశాజనకంగా లేదని తీసిపడేశారు. అంతేనా.. కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిమాణాలపైనా…నేరుగా మోదీనే గురి పెట్టారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నరేంద్రమోదీని విమర్శించారు కానీ.. అవి విభజన హామీలు, ప్రత్యేకహోదాపైనే ఆ విమర్శలు ఉండేవి..కానీ ఇప్పుడు మాత్రం.. దేశానికి సంబంధించిన అన్ని విషయాలపై విమర్శలు చేశారు.
బెంగళూరులో కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం తర్వతా చంద్రబాబులో ఈ మార్పు వచ్చినట్లు స్పష్టంగా గమనించివచ్చు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో వచ్చిన పరిస్థితే దేశంలో వస్తుందని… మీడియా వర్గాలు ఇప్పటికే విశ్లేషణలు, సర్వేలు ప్రసారం చేస్తున్నాయి . దానికి తోడు.. చంద్రబాబు అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారని.. ప్రొ.నాగేశ్వర్ లాంటి రాజకీయ విశ్లేషకులూ అంచనా వేశారు. ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కూడా.. చంద్రబాబును కూటమి వైపు ప్రొత్సహిస్తున్నారు. దీంతో ఆయన జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తన ప్రసంగంలో నేరుగా మోదీని టార్గెట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలే తనకు ముఖ్యం అని… తెలుగు రాష్ట్రాలను విడిచి పెట్టి ఎక్కడికీ వెళ్లనని సీఎం పదే పదే చెబుతున్నారు. బహుశా.. జాతీయ రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడు మహానాడులో కూడా అదే చెప్పొచ్చు. తాను ఢిల్లీకి వెళ్తానంటే.. ఇక్కడి ప్రజల్లో… రాష్ట్రం పరిస్థితి ఏమిటి అన్న అనుమానం ప్రజల్లో వస్తే.. మొదటికే మోసం వస్తుందన్న అనుమానంతోనే.. చంద్రబాబు.. తెలుగు రాష్ట్రాలకే ప్రాధాన్యం అని చెపుతున్నారని భావించవచ్చు. మొత్తానికి చంద్రబాబు కొద్ది కొద్దిగా… జాతీయ రాజకీయాలవైపు అడుగులేస్తున్నారన్నది మాత్రం స్పష్టమవుతోంది.