బాబ్లీ ప్రాజెక్టు ధర్నాకు సంబంధించి నమోదైన కేసులో ధర్మాబాద్ కోర్టు నుంచి ఏపీ సీఎంకి వారెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎలా స్పందించాలీ… వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లాలా, ఈ అంశంతో ముడిపడ్డ న్యాయపరమైన అంశాలతోపాటు, రాజకీయపరమైన కారణాలపై కూడా ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. కోర్టుకు వెళ్లి హాజరు కావడమా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమా అనే అంశంపై మంత్రులు, ఇతర నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ధర్మాబాద్ వెళ్లకుండా, ప్రత్యామ్నాయ మర్గాల ద్వారా హాజరీకి ప్రయత్నిస్తేనే మంచిదనేది మెజారిటీ నేతల అభిప్రాయంగా వ్యక్తమైందని తెలుస్తోంది. వాస్తవానికి ఇదొక చిన్న ధర్నా కేసు అనీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ కేసుపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం వెనక రాజకీయ ప్రోద్బలం స్పష్టంగా కనిపిస్తోందనీ, మహారాష్ట్రతోపాటు కేంద్రంలో కూడా భాజపా అధికారం ఉన్న నేపథ్యంలో… ప్రత్యామ్నాయాలు చూస్తూనే మంచిదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ధర్మాబాద్ కి వెళ్లాక అక్కడి పరిస్థితులు అనూహ్యంగా మారే అవకాశాలనూ ఆలోచించాలనీ, వెంటనే రిమాండ్ అని కోర్డు ఆదేశిస్తే… ఆ వెంటనే బెయిల్ కోసం ప్రయత్నించడం కూడా కొంత సమస్యగా మారే అవకాశం ఉంటుందనే అభిప్రాయమూ చర్చల్లో వ్యక్తమైనట్టు సమాచారం. టీడీపీ విషయంలో భాజపా కక్షపూరితంగా ఉంది కాబట్టి, అక్కడి వెళ్లాక పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఆందోళన కూడా వ్యక్తమైనట్టు తెలుస్తోంది.
అయితే, సాంకేతికంగా వాయిదాకు హాజరు కావాల్సి ఉన్నా… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించే మార్గాలపై న్యాయ నిపుణుల బృందం పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. హాజరు కాకుండా పిటీషన్ వేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి, ఇదేదో భారీ అవినీతి కేసు కాదు! అది కూడా పార్టీపరంగా జరిగిన ఓ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించారు. కాకపోతే, వ్యవహారం కోర్టుకు సంబంధించింది కాబట్టి, స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంకోపక్క, చంద్రబాబుకు నోటీసుల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. వాస్తవానికి గవర్నర్ కూడా చేసేదేమీ ఉండదనే చెప్పాలి. ఏదైమనా, ఏదో ఒక విధంగా కోర్టుకు హాజరు కావాలనే ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది. సాధారణంగా అయితే, ఒకసారి హాజరీ తీసుకుని… పూచీకత్తు మీద తిరిగి పంపించేస్తారు! అయితే, చంద్రబాబు నాయుడు చుట్టూ ఏర్పడి ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దీనిపై ఇంత తర్జనభర్జన చేయాల్సి వస్తోంది. ఏదేమైనా, బాబ్లీ అంశమై మంగళవారం నాడు ఏపీ సీఎం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.