ప్రత్యేక హోదా కోసం కాస్త గట్టిగా పోరాడటానికి ఎవరు ముందుకు వచ్చినా సరే……వెంటనే ఆ పోరాటాన్ని అణచివేయడానికి అహర్నిశలూ ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. పోరాడేవాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. పోలీస్ పవర్‌ని వాడేస్తున్నారు. ప్రత్యేక హోదా వేస్ట్ అని చె్ప్పి జనాలను నమ్మించడానికి ప్రయత్నాలు చే్స్తున్నారు. ఫైనల్‌గా మీరెవరు ఏమీ చెయ్యొద్దు…నన్ను నమ్మండి……నా పైన నమ్మకం ఉంచండి….నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా…మీ జీవితాలను బాగు చేస్తా అనే రేంజ్లో మాట్లాడేస్తున్నాడు. 2014లో చంద్రబాబు మాటలను నమ్మబట్టే ఆయనను గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి రెండున్నరేళ్ళుగా ఆయన ఏం చేశారు? సగం పదవీ కాలం పూర్తయ్యే టైంకి అంతా ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. మరి బాబును నమ్మడం ఎలా?
ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా అద్భుతమని చెప్పారు. పదిహేనేళ్ళు తీసుకొస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా అద్భుతం, హోదా వచ్చిందంటే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది…ఆ హోదా రావాలంటే నన్ను, మోడీని గెలిపించండి అని చెప్పిందీ చంద్రబాబే. పవర్లోకి రాగానే ప్రత్యేక హోదా ప్రాధాన్యాన్ని తగ్గించి చెప్పడం స్టార్ట్ చేసింది చంద్రబాబే. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా గురించి గంటలు గంటలు మాట్లాడిన బాబుకి ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రాధాన్యత ఏంటో చెప్పేవాళ్ళు కావాలట. అంటే హోదా గురించి ఏమీ తెలియకుండానే ప్రత్యేక హోదా అద్భుతం అని ఆనాడు చెప్పారా? ఒకవేళ బాబు, మోడీ పవర్లోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ప్రాధాన్యత మొత్తం పోయిందనే అనుకుందాం. మరి ప్యాకేజ్ మాటేంటి? రెండున్నర సంవత్సరాల తర్వాత ప్యాకేజ్ ప్రకటించారు. ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి అని చంద్రబాబే నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన రెండు వేల కోట్ల అప్పుని అద్భుతమని అనుకోమని బాబుగారు చెప్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందు ముంపు మండలాలను కలపడం గురించే ఇప్పటికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు బాబు. మరి ప్రమాణం చేశాక ఈ రెండున్నరేళ్ళలో ఏం చేసినట్టు? ఇప్పుడు చేస్తున్న స్పీడ్‌తోనే పనులు జరుగుతూ ఉంటే రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యేను? లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు అని మాటలు చెప్పడమే తప్ప చేతలేవి?
అన్నింటికీ మించి చంద్రబాబును నరేంద్రమోడీ పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని టిడిపి నాయకులే అంతర్గతం చెప్తూ ఉంటారు. మరి స్నేహంగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు రాకపోతూ ఉంటే ఇక పోరాటం తప్ప వేరే మార్గం ఉందా? మోడీతో స్నేహం చేసి ఈ రెండున్నరేళ్ళలో బాబు సాధించిందేంటి? బాబును నమ్మి ఇంకో రెండేళ్ళు కూడా ఎదురు చూస్తే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మిగిలేదేంటి? కేంద్ర స్థాయిలో విపక్ష పార్టీలన్నీ కూడా ఏకమవుతున్న వేళ టిడిపి కూడా బిజెపికి దూరంగా జరిగితే ఆ ఇంపాక్ట్ రాబోయే కాలంలో ఎలా ఉంటుందో బాబుకు బాగా తెలుసు. బాబు కూడా 2018లో బిజెపికి దూరంగా జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అప్పుడు బయటికి వస్తే టిడిపికి, బాబుకు లాభం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలు చేస్తున్న పోరాటాన్ని నమ్మి ….తెలంగాణా కోసం కెసీఆర్ చేసినట్టుగా ప్రత్యేక హోదాకు మద్దతిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌లోకి బిజెపికి, ఆ పార్టీ నాయకులకు స్థానం లేదన్న మెస్సేజ్ పంపిస్తే మాత్రం ఇంతకంటే ఎక్కువ ప్రయోజనాలే రాష్ట్రానికి వస్తాయనడంలో సందేహం లేదు. రెండున్నరేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును నమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాట సామర్థ్యాన్ని బాబు నమ్మాల్సిన టైం వచ్చింది. ఈ రెండున్నరేళ్ళుగా బాబు, మోడీ, వెంకయ్య మాటలు వింటున్నవాళ్ళకు ….ఇప్పుడిక ఆ మాటలపైన విశ్వాసం కలిగే ఛాన్సే లేదు. ప్రజలను నమ్మి కేంద్ర ప్రభుత్వంపైన పోరాటానికి సిద్ధపడడమా? లేక నన్ను నమ్మి సైలెంట్‌గా ఉండడమా అన్న విషయం బాబే తేల్చుకోవాలి. కానీ ఇప్పుడు కూడా మీడియా ప్రచారంతో, మాటలతో మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం 2019లో బాబు చెల్లించే మూల్యం మామూలుగా ఉండదేమో.