తెలుగుదేశం అధినేత ఎంఎల్ఎల కోటా నుంచి ప్రకటించిన ఎంఎల్‌సి అభ్యర్థుల జాబితా చాలామంది ఆశావహులను హతాశులను చేసింది. ఇప్పటికే మీడియాలో కథనాల ద్వారానూ పార్టీలో లాబీయింగు ద్వారానూ తమకు వచ్చేసినట్టే భావించుకున్నవారు కొందరున్నారు. బాబు తమకు సంకేతం ఇచ్చినట్టు సంబరపడినవారూ వున్నారు.చివరకు అందరికీ శూన్యమే మిగిలింది. వర్లరామయ్య,ు తమకు తప్పక వస్తుందనుకున్నారు. జూపూడి ప్రభాకరరావు తననూ పరిశీలించకపోతారా అని దింపుడు కళ్లెం ఆశపెట్టుకు కూచున్నారు. కాని హటాత్తుగా డొక్క మాణిక్క వరప్రసాద్‌ను వరించింది.ఈ కాంగ్రెస్ మాజీ మంత్రికి ఇంటిపేరుకు తగినట్టే డొక్క శుద్ధి వుందని అంటుంటారు. వాగ్దానంపైనే తీసుకున్నారు. ప్రస్తుతం కనీస వేతనాల బోర్డు అద్యక్షుడుగా వున్నారు. రాజధాని ప్రాంతంలో పలుకుబడి వున్న నేతలలో ఒకరుగా ఉపయోగపడతారన్నది అంచనా.
ఇక పార్టీ తరపున చర్చలకు వెళ్లే యువ నేతలు ఇద్దరు ముగ్గురు తమలో ఒకరికైనా చోటు దక్కుతుందని అది తానేనని అనుకుంటూ గడిపేశారు. మహిళల జాబితాలో ముళ్లపూడి రేణుక ఈ సారి ఘంటా శ్రీనివాసరావు మద్దతుతో సభకు వచ్చేసినట్టేనన్నారు. కాని చివరకు అవేవీ నిజం కాలేదు. నిర్ణయాల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు ఖరాఖండిగా లాభనష్టాలను బట్టి సామాజిక ప్రభావం ఆర్థిక ప్రాబల్యం బట్టి మాత్రమే అవకాశమిస్తారని మరోసారి తేలిపోయింది. మామూలుగాి తక్కువగా వున్నా లెక్కలు వేసి గెలిపించే చంద్రబాబు ఈ సారి ఆరో అభ్యర్థిని పెట్టకపోవడం ద్వారా వైసీపీ ఎంఎల్ఎ ఫిరాయంపు సమస్య కాకుండా జాగ్రత్తపడ్డారు. ఓటింగు గజిబిజి నివారించి లోకేశ్ పని తేలిక చేశారు.