కుప్పం ప్రజలే తన దేవుళ్ళు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు…మరో జన్మంటూ ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడుతానని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మీ ఆశీస్సుల కోసమే కుప్పం వచ్చానంటూ స్పష్టం చేశారు. ఎన్నిసార్లు గెలిపించినా ప్రతిసారి ఎక్కువ మెజార్టీతోనే గెలుపించారని…మీకదంరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అంటూ చంద్రబాబు భావోద్వేగంగా ప్రసంగించారు.
తాను కుప్పం వచ్చినా, రాకపోయినా మీ బిడ్డగా నన్ను గెలిపిస్తూనే వచ్చారని…మీ కోసమే ఉంటా.. మీ అభివృద్ధి కోసం మరింత పాటుపడుతానని వ్యాఖ్యానించారు. పేదరికం లేని ప్రాంతంగా మార్చుతానన్నారు. నా రాజకీయాలకు కుప్పం ప్రయోగశాల. వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పంను ఎంచుకున్నా. వచ్చే ఐదేళ్లలో కుప్పం ఋణం తీర్చుకుంటా. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
స్పష్టమైన ఎజెండాతోనే వచ్చానని చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. అందుకు నమూనాగా కుప్పంను మార్చుతానని చంద్రబాబు అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వేస్తా. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తా. పరిశుభ్రమైన ప్రాంతంగా కుప్పంను తీర్చిదిద్దే బాధ్యత నాది అన్నారు చంద్రబాబు.
కుప్పమే కాదు.. నాలుగు మండలాలకు 10కోట్లకు తక్కువ కాకుండా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. అన్ని మేజర్ పంచాయితీలకు 2 కోట్లు, మైనర్ పంచాయితీలకు కోటి చొప్పున అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్టీఅర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్ వాటర్ ఇస్తాం. అన్ని గ్రామాలకు, పంట పొలాల వద్దకు రోడ్లు వేస్తామన్నారు.
వీలైనంత త్వరలోన్ కుప్పంకు విమానాశ్రయం వస్తుందని.. ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు ఇక్కడి ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా..ఇక నుంచి కుప్పంలో రౌడియిజం చేస్తే అదే కడపటి రోజు అవుతుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.