భాజపాతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్లపాటు ఏం చేశారనే ప్రశ్న ఏపీ సర్కారుపై విపక్షాలు సంధిస్తూనే ఉన్నాయి. కేంద్ర సాయం కోసం నాలుగేళ్లు ఎందుకు వేచి చూశారనీ, ఈలోపుగానే ఎన్డీయే నుంచి బయటకి వచ్చి పోరాటం చేసి ఉంటే ప్రయోజనం ఉండేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, విపక్ష నేత జగన్ తో సహా కొంతమంది నాయకులు టీడీపీ సర్కారుకు సంధిస్తున్న విమర్శ. దీనిపై ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తూనే ఉన్నారు. ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడానికీ, కేంద్ర సాయం కోసం వేచి చూడటానికి గల కారణాలను పదేపదే ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. నేడు అమలాపురంలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఇదే అంశాన్ని మరోసారి సీఎం ప్రస్థావించారు.
రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదనీ, నవ్యాంధ్రకు దక్కాల్సిన కనీస సౌకర్యాల గురించి కూడా నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. అందుకే, కేంద్రంలోని అధికార పార్టీతో పొత్తుగా ఉంటే… రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా చేరామన్నారు. ఎన్నికలకు ముందే భాజపాతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. అయితే, కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు. అయినా రాష్ట్రం కోసం తన ప్రయత్నం తాను చేశాననీ, అన్ని మార్గాల ద్వారా కేంద్రం నుంచి సాయం వస్తుందేమోనని తన ప్రయత్నాలు ఆపలేదన్నారు.
నవ నిర్మాణ దీక్ష గురించి మాట్లాడుతూ… విభజన తరువాత పండుగ చేసుకునే వాతావరణం ఆంధ్రాలో లేదన్నారు. అందుకే అందరూ అంకిత భావంతో పనిచెయ్యాలన్న లక్ష్యంతోనే నవ నిర్మాణ దీక్షలు చేపట్టామన్నారు. నాలుగేళ్ల కిందట ప్రారంభించుకున్న ఈ దీక్షలు, ఇప్పటికి ఉపయోగపడ్డాయన్నారు. అందరం కష్టపడితే దేశంలో నంబర్ వన్ స్థాయికి మన రాష్ట్రం ఎదుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదనీ, కానీ ఆ బాధ్యతను కేంద్రం విస్మరిస్తోందన్నారు. కేంద్రం సాయం చేసినా చేయకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ ముందుకు వెళ్తామే తప్ప, వెనక్కి తగ్గే పరిస్థితి లేనే లేదన్నారు.
నిజానికి, ఆంధ్రా విషయంలో కేంద్రం చేయాల్సింది చెయ్యలేదు. కానీ, వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే, ప్రతిపక్షాలూ తయారయ్యాయి. కేంద్ర చేసిన మోసాన్ని చంద్రబాబు సర్కారు వైఫల్యంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి, దీన్ని సమర్థంగా తిప్పి కొట్టాలంటే… నాలుగేళ్ల ప్రయత్నాన్ని పదేపదే ప్రజలకు చెప్పాల్సిన అవసరం టీడీపీ ముందుంది. ఎన్నికల వరకూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన సవాల్ కూడా పార్టీ ముందుంది.