ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబం అంతా నారా వారి పల్లెకు చేరుకుంది. భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. మహిళలు వేసిన రంగవల్లులను చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఆసక్తిగా తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రజలు ఇచ్చిన ఆర్జీలను చంద్రబాబు స్వీకరించారు.
పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో చంద్రబాబు మనవడు దేవాన్ష్ సైతం పాల్గొన్నారు. ఎప్పుడూ స్కూల్స్లో ఆడటమే తప్ప ఊళ్లో ఆటల పోటీలు ఎలా ఉంటాయో తెలియని తన మనవళ్లను ఆడించాలని చంద్రబాబు కోరEరు. గోని సంచితో వేసుకుని దూకుతూ ఆడే పరుగుపందెంలో దేవాన్ష్ ను ఆడించుకున్నారు.
పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి భూమి పూజ చేశారు. అలాగే, నారావారిపల్లెలో రూ.3 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మహిళా సంఘాలకు నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు సరుకులు అందనున్నాయి. అనంతరం గ్రామంలో మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అటు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో ఐక్యూ పెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు.