ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తన అనుమతి లేకుండా పథకాలకు తన పేరు పెడుతున్నారని నాయకులపై ఆగ్రహించడానికి చాలా కారణాలున్నాయి. అంటే ఇప్పటికి దాదాపు డజను పథకాలకు చంద్రన్న నామకరణం చేసినవారు ఆయనకు తెలియకుండానే చేసి వుంటారని ఎవరు అనుకోరు. ఎందుకంటే వీటిలో కొన్ని తనే ప్రారంభించారు. రామన్న సంచారవైద్యశాలను చివరి నిముషంలో చంద్రన్న సంచార వైద్యశాలగా మార్చడం వల్ల మీడియాలో రెండు రకాల కథనాలు వచ్చాయి కూడా. అప్పుడే టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యెంగ్య కథనం ఇచ్చింది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా తన పేరుమీద తనే ఇన్ని పథకాలు ప్రారంభించుకోలేదని విమర్శించింది కూడా. జయలలిత రాజ్యంలోనైనా అన్నిటికీ అమ్మ పథకాలు అనే వుంటుంది. దాంతో ఆమే గుర్తుకు వస్తుంది. కాని ఇక్కడే చంద్రబాబుకు ఇరకాటం ఎదురైంది. అన్న అందామంటే అది ఎన్టీఆర్‌ను గుర్తు చేస్తుంది గాని తనను కాదు. ఇంత పోరాటం చేసి పార్టీని బతికించుకుని అధికారంలోకి తెచ్చుకుని కాస్తయినా స్వీయ నామస్మరణ చేసుకోకపోతే అయినవాళ్లు అభిమానులు వూరుకోరు కనుకనే కాస్త నిస్సంకోచంగానే చంద్రన్న జపం కొనసాగనిచ్చారు. చంద్రన్న సంక్రాంతి కానుకతో మొదలైంది. చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రుణమేలా, ఉద్యోగమేళా,వ్యవసాయ క్షేత్రం,దళితబాట, చేయూత ఇలా పరంపరగా సాగించారు.ఎన్టీఆర్ భరోసా, ఆరోగ్యసేవ మాత్రమే మిగిలాయి.
అయితే ప్రతి రూలుకు ఒక మినహాయింపు వుంటుందన్నట్టే సామాజిక వాస్తవాలను విస్మరించడం వివాదాలకు దారితీసి మొదటికే ఎసరు తెచ్చింది. కాపుల కోసం నిర్మించే భవనాలకు చంద్రన్నపేరే పెట్టాలని అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడమే బెడిసికొట్టింది.దీనిపై ఆ కుల నాయకుల నుంచి విమర్శ వచ్చాకైనా మార్చుకోకపోగా తప్పేమిటని మంత్రి నారాయణ వీర విధేయత ప్రదర్శించారు. నిజానికి ఆయన కూడా ఆ తరగతులకు చెందినవారేనని కుల స్పెషలిస్టుల ఇన్పుట్. అయినా చంద్రబాబు ఏ వైరుధ్యాన్ని తగ్గించి కాపుల ఓట్లు తెచ్చుకోవాలనుకుంటున్నారనేది నారాయణ మర్చిపోయారు. కాని తప్పు అర్థమైన చంద్రబాబు హఠాత్తుగా ఆగ్రహం ప్రదర్శించడం ద్వారా ఈ గండం గట్టెక్కాలని నిర్ణయించుకున్నారు. ఎవరిని అడిగి నా పేరు పెడుతున్నారని మందలించినట్టు కథనాలు విడుదల చేశారు. పైడి ఇకపై ఆయన అనుమతి లేకుండా పథకాలను పేరు పెట్టొద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. సో పెద్ద ఫికర్ లేదు. ఇప్పటికీ అనుమతి తీసుకోవడానికి అవకాశం వుంది.. అన్నట్టు ఈ చంద్రన్న జపంలో మంత్రి రావెల కిశోర్‌బాబు చాలా ముందున్నారనేది ఒక సమాచారం. ఈ పథకాలలో ముప్పాతిక భాగం ఆయన ఇలాకాలోవే. ఇకపోతే కాపుల భవనాలకు అందరూ అంగీకరిస్తే వంగవీటి మోహనరంగారావు పేరైనా పెడతామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించడం కొసమెరుపు. కాపుల ఆందోళనను ఏదో ఒక రూపంలో తిరిగి తీసుకురావాలనుకుంటున్న ముద్రగడ పద్మనాభం ఈ సమస్యపై కులాల పేర్లతో సహా లేఖ రాయడం మరో మలుపు. సో మళ్లీ కులాల కుంపటి వూదడానికే అటూ ఇటూ తయారవుతున్నారన్నమాట.