ఏపీకి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దూకుడు పెంచారు. ఈ టర్మ్ లో ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పోలవరం నిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని…దాంతో పనుల్లో వేగం పెంచేలా కార్యాచరణ సిద్దం చేయాలని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సమీక్ష రాష్ట్రంలోని ప్రాజెక్టులపైనే నిర్వహించి పోలవరం విషయంలో తన ఉద్దేశ్యాన్ని చాటారు చంద్రబాబు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకొని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ప్రాజెక్టును స్వయంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు.
పోలవరం ప్రాజెక్టును సోమవారం సందర్శిస్తానని చంద్రబాబు స్పష్టం చేయడంతో గతంలోలాగా ఇక నుంచి ప్రతి సోమవారం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు రాష్ట్రంలోని ప్రాజెక్టుల, పనితీరుపై పూర్తి వివరాలతో వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.