ఏపీలో చారిత్రాత్మక విజయాన్ని అందుకొని జోష్ మీదున్న చంద్రబాబు తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ నెల ఆరో తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కోసం హైదరాబాద్ కు వస్తోన్న చంద్రబాబు.. ఏడో తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నాలుగోసారి సీఎం అయ్యాక మొదటి సారి ఎన్టీఆర్ భవన్ కు వస్తోన్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదివారం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో నూతన అధ్యక్షుడి ఎంపిక, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై నేతలతో అధినేత చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం నేతలు టీడీపీని వీడినా కార్యకర్తలు ఇంకా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారని భావిస్తోన్న చంద్రబాబు.. తెలంగాణపై ఫోకస్ చేస్తే పార్టీ తిరిగి పట్టాలెక్కుతుందని విశ్వాసంతో ఉన్నారు.
పైగా, బీఆర్ఎస్ లో చాలామంది టీడీపీ మాజీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళలేని నేతలు టీడీపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు మల్లారెడ్డి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తెలంగాణ లీడర్లతో భేటీ నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది.