రెండ్రోజులుగా ఎదురుచూస్తున్న మంత్రులకు శాఖల కేటాయింపు ఏపీలోనూ పూర్తయింది. గతానికి భిన్నంగా ఈసారి శాఖల కేటాయింపు కాస్య ఆలస్యమైనా…సమతుల్యంగా కేటాయించినట్లు కనపడుతోంది. అయితే, ఈ శాఖల కేటాయింపులో చంద్రబాబు -మోడీ ఒకేవిధంగా ఆలోచించినట్లు కనపడుతోంది.
మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత ఒకటి-రెండు గంటల్లో శాఖల కేటాయింపు ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం ఇటు కేంద్రమంత్రివర్గంతో పాటు రాష్ట్ర మంత్రులకు కూడా శాఖల కేటాయింపు ఆలస్యం అయ్యింది.
మరోవైపు 2014లో ఎన్డీయేలో ఉన్న టీడీపీకి ఆనాడు ప్రధాని మోడీ పౌరవిమానయాన శాఖను కేటాయించారు. అశోక్ గజపతిరాజు అప్పట్లో ఈ శాఖను నిర్వహించగా… 2024లో ఎన్డీయేలో భాగంగా టీడీపీకి ప్రధాని మోడీ అదే శాఖను కేటాయించారు. ఈసారి రామ్మోహన్ నాయుడుకు ఆ అవకాశం దక్కింది.
ఇటు 2014లో రాష్ట్ర ప్రభుత్వంలో… ఎన్డీయేలో ఉన్న బీజేపీకి వైద్యశాఖను అప్పజెప్పారు చంద్రబాబు. ఆనాడు బీజేపీ నుండి గెలిచిన కామినేని శ్రీనివాస్ ఆ బాధ్యతలు నిర్వహించగా, 2024లో బీజేపీ నుండి గెలిచి చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్న సత్యకుమార్ మళ్లీ అదే వైద్యశాఖను అప్పజెప్పారు.