తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెదేపా, భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తన శిష్యుడు కేసీఆర్ పయనిస్తున్న మార్గంలోనే పయనించాలనుకోవడం చాలా విస్మయం కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కేసీఆర్ కి రాజకీయ గురువుగా ఉండేవారు కానీ ఇప్పుడు ఆయనే కేసీఆర్ కి శిష్యుడు అయిపోయినట్లు స్పష్టంగా కనబడుతోంది. కేసీఆర్ తనదయిన పంధాలో అజేయంగా ముందుకు సాగిపోతుంటే, చంద్రబాబు నాయుడు కూడా గుడ్డిగా కేసీఆర్ ని అనుసరించాలను కోవడం సిగ్గు చేటు.
అధికారమే పరమావధి అన్నట్లుగా చంద్రబాబు నాయుడు తన పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం చాల దిగ్భ్రాంతి కలిగిస్తోంది. దాని కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేసి ప్రజలకిచ్చిన హామీలను అమలుచేసి, రాష్ట్రాభివృద్ధి చేసి ప్రజలను మెప్పించి మళ్ళీ అధికారం నిలబెట్టుకొందామని చెప్పి ఉండి ఉంటె అందరూ హర్షించేవారు కానీ రాష్ట్రంలో ప్రతిపక్షలని బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అధికారం నిలబెట్టుకొందామని చంద్రబాబు నాయుడు చెప్పడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
చంద్రబాబు నాయుడు సమర్ధుడు, మంచి పరిపాలనానుభావం ఉన్న వ్యక్తి అని నమ్మబట్టే 2014 ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తెదేపాను గెలిపించారు. కనుక ఆయన తన సమర్ధత, పరిపాలనానుభావంతో రాష్ట్రాభివృద్ధి చేసి ప్రజల ఆదరణ పొంది అధికారం నిలబెట్టుకోవాలని ఆలోచించకుండా, ఇటువంటి విపరీత ఆలోచనలు చేయడం చాలా దురదృష్టకరం.
తెలంగాణాలో ఓటుకి నోటు కేసులో కేసీఆర్ చేతిలో చంద్రబాబు నాయుడు ఎదురుదెబ్బ తిన్నప్పటి నుంచి ఆయన తీరులో చాలా మార్పు కనిపిస్తోంది. ఆయనలో ఇదివరకటి ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. అలాగే తన వ్యూహాలని జగన్మోహన్ రెడ్డి సమర్ధంగా ఎదుర్కోవలేక చతికిలబడుతున్నప్పటికీ, అతను లేవనెత్తుతున్న ప్రజా సమస్యలు, ప్రభుత్వ దుబారా ఖర్చులు, తెదేపా నేతల అవినీతి, అక్రమాలు, వాటిని అరికట్టడంలో ముఖ్యమంత్రి వైఫల్యం వంటి కారణాల చేత ప్రజలలో తెదేపా పట్ల క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందని చంద్రబాబు నాయుడు గుర్తించినందునే తన శైలికి పూర్తి వ్యతిరేకమయిన ఇటువంటి అప్రజాస్వామిక ఆలోచనలు చేస్తున్నట్లున్నారు.
చంద్రబాబుని భయపెడుతున్న మరో విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల నాటికి భాజపా తమ పార్టీతో తెగ తెంపులు చేసుకొంటుందేమోనని. ఆ అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి కూడా. అయితే రాష్ట్రంలో భాజపాకి పెద్దగా బలం లేనప్పటికీ అది వైకాపాతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే అ కూటమిని ఎదుర్కోవడం తెదేపాకి చాలా కష్టం అవవచ్చును. ఒకవేళ అది జరుగకపోయినా, వైకాపా-కాంగ్రెస్ పార్టీలు జత కట్టే అవకాశం కూడా కనబడుతోంది. అది కూడా తేదేపాకు ప్రమాదకరమే. అందుకే వాటికి ఆ అవకాశం లేకుండా చేయడానికే చంద్రబాబు నాయుడు ఈ వ్యూహం అమలు చేయాలనుకొంటున్నారేమో?
రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని చంద్రబాబు నాయుడు ఇంత స్పష్టంగా చెప్పిన తరువాత, రాష్ట్రంలో తెదేపాకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలని తపిస్తున్న భాజపా, ఎప్పటికయినా ముఖ్యమంత్రి కావాలని తపిస్తున్న జగన్మోహన్ రెడ్డి చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోరు కనుక, ఆ పార్టీలు కూడా చంద్రబాబు నాయుడుని ధీటుగా ఎదుర్కొనేందుకు, ఆయన బారి నుండి తమ పార్టీలను కాపాడుకొనేందుకు తగిన వ్యూహాలు రచించుకొని వెంటనే పావులు కదపడం మొదలుపెట్టడం తధ్యం.
ఒకవేళ భాజపా కనుక పావులు కదపడం మొదలయితే ముందుగా అది తెదేపానే దెబ్బ తీస్తుంది. వాటి మధ్య రాజకీయ యుద్ధం మొదలయితే రాష్ట్రాభివృద్ధి స్థంభించిపోవచ్చును. చంద్రబాబు నాయుడు-నరేంద్ర మోడీల మధ్య మంచి సక్యత ఉంది కనుక వేగంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ప్రజలు తెదేపా-బీజేపీ కూటమికి ఓట్లేసి గెలిపించారు. కానీ ఆ ప్రయోజనం నెరవేరకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలు తెదేపాను తిప్పి కొట్టవచ్చును. కనుక చంద్రబాబు నాయుడు తన ఈ విపరీత ఆలోచనను అమలుచేసేముందు పునరాలోచించుకోవడం చాలా మంచిది.