ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెదేపా, బీజేపీల తరపున గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయినా ఫలితం దక్కలేదు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయం చెప్పమని ఒక విలేఖరి ఆయనని అడిగినప్పుడు “మనం ఏదయినా ఆశిస్తే అది దక్కనప్పుడు బాధ కలుగుతుంది కానీ ఏమీ ఆశించకుండా పని చేసుకుపోతే ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఎటువంటి బాధ కలుగదు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నేను నిజాయితీగా నా బాధ్యతలను నిర్వహించాను. కానీ ఫలితాలు వేరేగా వచ్చాయి. నా బాధ్యతను నేను నిర్వర్తించాననే తృప్తి కలిగింది. అయినా నేను ప్రజలు ఓట్లు వేస్తారనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ ని అభివృద్ధి చేయలేదు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసుకుపోవడమే నాకు తెలుసు. ఆ ప్రయత్నంలో ప్రజలలో చైతన్యం తేవడానికి కృషి చేస్తుంటాను,” అని సమాధానం చెప్పారు.
గ్రేటర్ ఎన్నికలలో ఇరువురు ముఖ్యమంత్రుల కుమారులు తమ తమ పార్టీలకి నాయకత్వం వహించడం, ఎన్నికలలో తెరాస అఖండ విజయం సాధించడంతో కె.టి.ఆర్. ముందు నారా లోకేష్ తేలిపోయినట్లయింది. ఈ అవమానాలు సరిపోవన్నట్లు అప్పుడే తెదేపా ఎమ్మెల్యేలు కొందరు తెరాసలోకి వెళ్లిపోవడానికి సిద్దం అయిపోతున్నారు కూడా. వారు వెళ్ళిపోతే తెలంగాణాలో తెదేపా పతనం ప్రారంభం అయినట్లే భావించవచ్చును.
సుమారు పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చొన్నప్పుడు, తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పుడు కూడా పార్టీ కుప్పకూలిపోకుండా చంద్రబాబు నాయుడు కాపాడుకోగలిగారు. కానీ రాష్ట్ర విభజన జరిగి రెండేళ్ళు పూర్తి కాకముందే తెలంగాణాలో పార్టీ తుడిచిపెట్టుకుపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవలసి వస్తోంది. బహుశః ఆ నిస్సహాయత, నిరాశే ఆయన మాటలలో స్పష్టంగా కనిపిస్తోంది.
సమస్యలను సవాలుగా తీసుకొని పనిచేస్తుంటానని తరచూ చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఈవిధంగా వేదాంతం మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రేటర్ ఎన్నికలలో తమ కూటమికి విజయం కలగాలనే కోరికతోనే ఆయన ప్రచారానికి వచ్చేరు. ఆ సందర్భంగా తను హైదరాబాద్ ని ఏవిధంగా అభివృద్ధి చేసారో పదేపదే ప్రజలకు చెప్పుకొని, అది చూసి తమ కూటమికి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. కానీ ఇప్పుడు ఓడిపోయినా తరువాత “ఫలితాలు ఆశించి పని చేయలేదు..ఓట్లు కోరి హైదరాబాద్ ని అభివృద్ధి చేయలేదు,” అని చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
బహుశః తెలంగాణాలో ఇక తెలుగుదేశం పార్టీ ఇంకా ఎంతో కాలం మనుగడ సాగించలేదని ఆయన కూడా ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లే ఉన్నారు. అందుకే “ప్రజలను చైతన్యపరచాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఫలితం కనబడటం లేదు” అన్నట్లుగా ఆయన మాట్లాడారు. తెలంగాణాలో పార్టీ పరిస్థితి పట్ల ఇప్పటికే ఆయనకి, తెలంగాణా పార్టీ నేతలకి కూడా పూర్తి అవగాహన ఏర్పడి ఉంటుంది కనుక అందరూ కూర్చొని తరువాత ఏమి చేయాలనే విషయం ఇప్పుడే ఆలోచించుకొంటే మంచిదేమో.