తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాల్సిన చారిత్రక అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఆయన టీడీపీ నేతలతో సమావేశం అనంతరం మాట్లాడారు. అసెంబ్లీ రద్దు, త్వరలో ఎన్నికలు, ఇతర పార్టీలతో పొత్తులు… తీవ్ర చర్చలు జరుగుతున్న ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడి తాజా సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, తెలంగాణలో పార్టీకి సంబంధించిన భవిష్యత్తు వ్యూహాలన్నీ ఈ రాష్ట్ర నేతలే సమష్టి చర్చించి నిర్ణయిస్తారనీ, ఆ నిర్ణయానికే తాను మద్దతు ప్రకటిస్తానంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల మనోభావాల ప్రకారం ముందుకు సాగాల్సిన అవసరం ఉందనీ, నాయకులతోపాటు కార్యకర్తలూ ప్రజలూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పారు. ఏ పార్టీకి సహకరిస్తే న్యాయమో అనేది రేపో ఎల్లుండో నాయకులు కూర్చుని చర్చిస్తారనీ, వారి అభిప్రాయాలకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు.
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా విమర్శలేమీ చెయ్యకపోవడం గమనార్హం! కేసీఆర్ కీ తనకీ మధ్య విభేదాలు పెట్టే విధంగా ప్రధాని మోడీ వైఖరి ఉందంటూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ప్రధాని మాట్లాడిన తీరును గుర్తుచేశారు. తనకు మెచ్యూరిటీ లేదంటూనే ఇతరులతో పోల్చే ప్రయత్నం చేశారన్నారు. విభజన తరువాత తెలంగాణలో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామనీ, కానీ మాట మాత్రమైనా చెప్పకుండా టీడీపీతో తెగతెంపులు చేసుకున్నారన్నారు. ఎవ్వరికైనా అధికారం శాశ్వతం కాదనీ, సిద్ధాంతాల కోసం రాజకీయాలు చేయాలన్నారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు ఎన్డీయే న్యాయం చెయ్యలేదనీ, అందుకే భాజపాతో తెగతెంపులు చేసుకుని హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అలాంటి పార్టీకి సహకరించేవారిని కూడా ఉపేక్షించడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం!
ఈరోజున తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉందంటే కారణం… గతంలో తెలుగుదేశం పార్టీని వేసిన పునాదులే అన్నారు చంద్రబాబు. హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ టీడీపీ అనీ, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత పెంచిన పార్టీ టీడీపీ అన్నారు. మళ్లీ టీడీపీని తెలంగాణలో నిలబెట్టుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందనీ, పార్టీ కోసం త్యాగాలకు కూడా వెనకాడకుండా కష్టపడే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలూ నాయకులకు తాను రుణపడి ఉంటానని అన్నారు. తెలంగాణ పార్టీ శాఖను ఇక్కడి నాయకుల అభీష్టం మేరకే నడిపిస్తామన్నారు.
ఓవరాల్ గా పొత్తుల విషయమై త్వరలో చర్చించి నిర్ణయిస్తామని చెబుతూనే, పార్టీ భవిష్యత్తుకు ఏది మంచిదైతే అదే తమ నిర్ణయం అవుతుందన్నట్టు శ్రేణులను సిద్ధం చేసే విధంగా కామెంట్ చేయడం ఒక ముఖ్యమైన పాయింట్. ఇంకోటి, తెరాసను నేరుగా విమర్శించకుండా… అన్యాయం చేస్తున్న బీజేపీకి అండగా ఎవరైనా నిలిస్తే తీవ్రంగా వ్యతిరేకించాలన్న పిలుపునూ పరోక్షంగా ఇచ్చారు. సో, తెలంగాణలో టీడీపీ ఎన్నికల కార్యాచరణపై మరో రెండుమూడు రోజుల్లో స్పష్టత ఇస్తారన్నమాట!