టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యేల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. ఓ సారి బీజేపీలో చేరుతారని.. మరోసారి వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే అన్నీప్రచారాలుగానే మిగిలిపోయాయి. అటు ఖండించలేక.. ఇటు అంగీకరించలేక గంటా సైలెంట్‌గా ఉండిపోయారు. మధ్యలో స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చినప్పుడు చంద్రబాబు సూచనలకు అనుగుణంగా రాజీనామాలు చేసి.. వైసీపీపై ఒత్తిడి పెంచాలనే ప్లాన్ అమలు చేశారన్న గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆ ఉద్యమమూ సైలెంట్ అయిపోయింది.
ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి కనిపిస్తూండటంతో గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే యాక్టివ్ అవుతున్నారు. తన నియోజకవర్గం మొత్తం ఇప్పుడు ఫ్లెక్సీలతో నింపేశారు. అన్నింటిలోనూ పెద్దగా చంద్రబాబు ఫోటోలు పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేసుకుని ఇక పక్క చూపులు చూడటం దండగని టీడీపీలోనే ఉండటం మంచిదని ఆయన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆయనకు గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. కాస్త రిలీఫ్ అయిన తర్వాత టీడీపీ తరపున ప్రత్యక్ష కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
అయితే చంద్రబాబు ఆయనకు మునుపటి ప్రాధాన్యత ఇస్తారా అన్నది సందేహమే. ఓ వైపు ఓడిపోయినా.. కేసులు పెట్టినా మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చురుగ్గా పార్టీ కోసం పని చేస్తున్నారు. ఆయనకు గంటాకు ఏ మాత్రం సరి పడదు. ఇప్పుడు గంటాకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇచ్చినా అయ్యన్నకు కోపం వస్తుంది. అలాంటి పరిస్థితి వద్దని టీడీపీ నేతలు కూడా కోరుకుంటున్నారు. చివరికి వచ్చే సరికి చంద్రబాబు.. గంటాకు టిక్కెట్ కూడా ఇస్తారో లేదోనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ కోసం పని చేయని వారిని ప్రోత్సహించకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే గంటాకు.. చంద్రబాబుకు మధ్య ఉన్న రాజకీయ స్నేహం గురించి అంచనా వేయడం కష్టమే. ఈ విషయంలో చంద్రబాబు నమ్మకాన్ని గంటా మళ్లీ పొందితే .. అద్భుతమే అనుకోవచ్చని టీడీపీ నేతలంటున్నారు.