తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని చంద్రబాబు అంగీకరించారు. వారి లేఖలను టిటీడీ ఇక నుంచి ఆమోదిస్తుందని సమాచారం ఇచ్చారు. గతంలో రేవంత్ లేఖ రాసినప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జాబితా కూడా పంపించారు. ఆ జాబితాలోఉన్న వారి లేఖలను టీటీడీ ఆమోదించి దర్శనం టిక్కెట్లను మంజూరు చేస్తుంది.
తిరుమలలో తమ సిఫారసు లేఖలు అనుమతించాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు చాలా రోజులుగా అడుగుతున్నారు. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండపై తమ ఆలయాల్లో ప్రోటోకాల్ ఏపీ నేతలకు ఇవ్వబోమని హెచ్చరించారు. ఈ విషయంలో మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ ఆదేశించారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటాన్ని నిషేధించారు.
మంత్రి కొండా సురేఖ కూడా శ్రీశైలం ఆలయానికి వెళ్లినప్పుడు కూడా ఈ సిఫారసు లేఖల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. చివరికి టీటీడీ చైర్మన్ ను పిలిపించి మాట్లాడిన చంద్రబాబు రేవంత్ రెడ్డి రాసిన లేఖపై అభిప్రాయం అడిగారు. ఆయన కూడాఇస్తేనే మంచిదని చెప్పడంతో చంద్రబాబు ఆమోదం తెలిపారు. వారానికి రెండు సిఫారసు లేఖల్ని అనుమతించాలని నిర్ణయించారు.