తెలుగుదేశం పార్టీ అధినేతకు.. ఏకంగా 74 మందితో భద్రత కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తనకు టూ ప్లస్ టూ భద్రత మాత్రమే ప్రభుత్వం కల్పిస్తోందని.. చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ప్రభుత్వం మాత్రం… మొత్తంగా 74 మందితో చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నామని నేరుగా హైకోర్టుకే తెలిపింది. తనకుమావోయిస్టుల నుంచి ముప్పు ఉందని.. భద్రత కుదింపుపై పునఃసమీక్షించాలని చంద్రబాబు తరపు లాయర్ హైకోర్టును కోరారు. అయితే.. ప్రభుత్వ తరపు లాయర్ మాత్రం.. నిబంధనల కంటే ఎక్కువ భద్రతే కల్పిస్తున్నామని కోర్టు ముందు వాదించారు. నిబంధనల ప్రకారం.. చంద్రబాబుకు 58 మందితోనే భద్రత కల్పించాల్సి ఉందని.. అయితే తాము.. 74 మందితో భద్రత కల్పిస్తున్నామన్న ఏజీ చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు ఎంతమందితో ఎక్కడెక్కడ..ఎలా భద్రత కల్పిస్తున్నారో … కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 9కి వాయిదా వేసింది. మరో వైపు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత కూడా చంద్రబాబుకు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదని ప్రకటించారు. 58 మందికి బదులు 74 మందితో భద్రత కల్పిస్తున్నామని కోర్టులో లాయర్ చెప్పిందే మంత్రి కూడా చెప్పారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే కల్పిస్తామని.. చంద్రబాబు ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం కుదరదని ప్రకటించారు.
ప్రభుత్వం మారిన తర్వాత.. చంద్రబాబుకు వరుసగా..సెక్యూరిటీ తగ్గుతూ వస్తోంది. మొదట.. ప్రోటోకాల్ వాహనాన్ని తొలగించారు. ఆ తర్వాత రూట్ క్లియరెన్స్ ఎస్కార్ట్ ను కూడా తొలగించారు. ఆ తర్వాత భద్రతను కుదిరించారు. కుటుంబసభ్యులకు కూడా భద్రత తొలగించారు. ఈ చర్యలన్నింటిపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ హయాంలో జరిగిన పరిణామాలను గుర్తు తెచ్చుకుని ఆందోళన చెందుతున్నారు. అయితే.. టూ ప్లస్ టూ భద్రతకు.. ప్రభుత్వం చెబుతున్న 74 మంది భద్రతకు.. చాలా తేడా ఉండటంతో.. అసలు భద్రత ఎంత కల్పిస్తున్నారనేది క్లారిటీ లేకుండా పోయింది.