కేంద్రంతో సామరస్యపూర్వకంగా ఉంటూ మాత్రమే రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకోవాలని చంద్రబాబునాయుడు పదేపదే అంటూ ఉన్నారు. అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. తన మంత్రివర్గ సహచరుల వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇదే వేవ్లెంగ్త్కు అందరినీ ట్యూన్ చేసేశారు కూడా! కాకపోతే కేంద్రం తాము ఏపీకి నిధులు తవ్విపెట్టేశాం అని చెప్పే మాయా ప్రకటనల విషయంలో తాము నోరు తెరిచి ప్రజలకు వాస్తవాలను చెప్పకపోతే అందరూ తమను అనుమానించే పరిస్థితి వస్తుందని ఆయన గుర్తించారు. అందుకే కేంద్రం ఈ రెండేళ్లలో ఇచ్చిన నిధుల్లో అసలు కేంద్రంనుంచి వాటాగా అన్ని రాష్ట్రాలతో పాటు తమకు రావాల్సిన నిధులు ఎంతో, విభజన చట్టం ప్రకారం ఇచ్చిన నిధులు ఎంతో లెక్క తేల్చాలని వాటిని విడివిడిగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించారు.
ఈ విషయంలో ఆర్థిక శాఖ కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు తేల్చింది. ఈ లెక్కలు చూస్తే రాష్ట్ర ప్రజలకు మరింతగా కడుపు మండుతుంది. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు ఎలా పన్నుల్లో వాటాలు, ఇతర నిధులు ఇస్తారో ఆ మాదిరిగానే ఏపీకి ఇచ్చారు తప్ప.. ప్రత్యేకంగా ఇవ్వలేదనేది తాజాగా తేలుతున్న అంశం. హోదా విషయంలో అన్యాయం మాత్రమే కాకుండా విభజన చట్టం ప్రకారం దక్కవలసిన నిధుల విషయంలో కూడా కేంద్రం దారుణమైన వంచనకు పాల్పడుతున్నదని దీన్ని గమనిస్తే అర్థం అవుతుంది.
లెక్కలు తేల్చడం వరకు బాగానే ఉంది. మరి దీన్ని విస్తృతంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం ఎలా? ఏదో పత్రికలకు లీక్ చేసి, ప్రజలు పత్రికలు చదివి తెలుసుకుంటార్లే అనుకోవడం మాత్రమేనా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తాము ఏపీకి చాలా నిధులు ఇచ్చేశాం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా భాజపా నాయకులు నియోజకవర్గాల వారీగా కేంద్రం వేల కోట్ల నిధులు ఇచ్చేసిందంటూ విడివిడిగా స్థానిక భాజపా నాయకుల బొమ్మలతో కరపత్రాలు ముద్రించి ఊరూరా తిరిగి పంచిపెట్టారు. మరి భాజపా ప్రచారం ఎంత అవాస్తవమో అదే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి, వారి కేటాయింపుల్లో ఉన్న మోసాన్ని ప్రజలకు చెప్పడానికి రాష్ట్ర సర్కారు ఏం చేస్తుందో చూడాలి. భాజపా చేసిన మోసాన్ని కరపత్రాలు లేదా మరో రూపంలో ప్రజల వద్దకు తీసుకెళ్లగల ధైర్యం వారితో సామరస్య సంబంధాలను కోరుకునే చంద్రబాబునాయుడు చేయగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఏదో ఈ వివరాలు లీక్ చేయడంతో ఆయన ఊరుకుంటారా? లేదా, కేంద్రం నుంచి దక్కవలసిన నిధుల వివరాలను స్పష్టంగా ప్రజల ముందుంచుతారా చూడాలి!