తెలంగాణా తెదేపా నేతలు రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఉమా మాధవ రెడ్డి తదితరులతో నిన్న తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఏపి ముఖ్యమంత్రి బాధ్యతల కారణంగా తీరిక లేకపోయినప్పటికీ, తెలంగాణా తెదేపాని తాను ఎన్నడూ మరిచిపోలేదని, ఎప్పటికప్పుడు పార్టీ వ్యవహారాల గురించి సమాచారం తెలుసుకొంటూనే ఉన్నానని చెప్పారు. విజయవాడలో కూర్చొని రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలలో పగలు కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయో తన కంప్యూటర్ ద్వారా చూసి అధికారులని హెచ్చరించగలుగుతున్నానని, అలాగే తెలంగాణా తెదేపా వ్యవహారాలని, నేతల పనితీరు గురించి తెలుసుకోగలనని చెప్పారు.
తెలంగాణాలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొని, పూర్వ వైభవం సాధించవలసిన బాధ్యత మీపైనే ఉందని చెప్పారు. నేతలందరూ కలిసి పనిచేస్తే వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం సాధ్యమేనని చెప్పారు. తాను ఎన్నడూ తెలంగాణా నేతలకి దూరం కానని, ఎప్పుడూ వారికి అందుబాటులోనే ఉంటానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇకపై ప్రతీ శనివారం తాను కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గానీ వారికి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణా నేతలకి ఆయన మరో ముఖ్యమైన సలహా కూడా ఇచ్చారు. వివిధ అంశాలపై మాట్లాడుతున్నప్పుడు, ఏపితో పోల్చి మాట్లాడవద్దని, దాని వలన మీరే ఇబ్బంది పడవలసివస్తుందని హెచ్చరించారు. తెలంగాణా తెదేపా నేతలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపి నుంచి రిమోట్ పద్దతిలో నడిపిస్తున్నారనే తెరాస వాదనలని దృష్టిలో పెట్టుకొనే ఆవిధంగా సలహా ఇచ్చి ఉండవచ్చు. లేదా తెలంగాణా తెదేపాపై ఏపి ముద్రని తుడిచివేయాలని కావచ్చు.
అయితే ఆయన తెలంగాణాలో అడుగుపెట్టకుండా, అక్కడి రాజకీయాలకి, పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటూ తెదేపాకి పూర్వవైభవం సాధించడం సాధ్యమేనా? పైగా తెలంగాణాలో భాజపా కూడా ఇప్పుడు దూరం అయినందున దానినీ ఎదుర్కోవలసిన దుస్థితి ఏర్పడింది. తెరాస ధాటికి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ చాలా డీలా పడిపోయినప్పటికీ, నేటికీ కాంగ్రెస్ నేతలు తెరాసని గట్టిగా డ్డీకొంటూ దానికి తామే సరైన ప్రత్యామ్నాయం అన్నట్లు నిరూపించుకొంటున్నారు. కానీ తెలంగాణా తెదేపాలో రేవంత్ రెడ్డి తప్ప మరెవరూ గట్టిగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఆ కారణంగా తెదేపా రాష్ట్రంపై తన పట్టుని, తన ఉనికిని కూడా కోల్పోతోంది. ఈ నేపధ్యంలో పార్టీని బలోపేతం చేసుకొని పూర్వ వైభవం సాధించడం సాధ్యమేనా? సాధ్యమా కాదనుకొంటే, అందుకు ఏమి చేయాలి? అని చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు అందరూ నిజాయితీగా ఆలోచించుకొంటే మంచిది లేకుంటే చివరికి నిరాశ, వృధా ప్రయాసే మిగులుతుంది.