ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా పది రోజులు.. ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉండిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పదిరోజులపాటు వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విజయవాడ కలెక్టరేట్ ఆవరణలోని బస్సునే నివాసంగా మార్చుకున్నారు. లక్ష్యం ఒకటే..వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే. ఆ పని పూర్తయ్యాకే ఇంటికి వెళ్తానన్న చంద్రబాబు.. నిర్దేశించుకున్న లక్ష్యం చేరువ అయ్యాకే ఇంటికి తిరుగు పయనమయ్యారు.
దాదాపు పదిరోజుల రోజుల తర్వాత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్ళారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండ్లు పడి , విజయవాడ జలదిగ్బంధం అయిన సంగతి తెలిసిందే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంద్రబాబు కదిలారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పదిరోజులుగా విజయవాడ కలెక్టరేట్ ను సెక్రటేరియట్ గా మార్చుకొని అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడి నుంచి సమీక్షలు నిర్వహించారు.
ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాధితులకు అండగా ఉంటూ.. భరోసా కల్పించారు. అర్దరాత్రి సైతం బాధి తుల వద్దకు వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు తెలియజేయాలని టోల్ ఫ్రీ నెంబర్ ఉంచారు. వరద నుంచి విజయవాడ పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉంటానని మాట ఇచ్చిన చంద్రబాబు పదిరోజులు అక్కడే ఉండి.. పరిస్థితి కుదుటపడటంతో మంగళవారం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్ళారు.
విజయవాడలో అన్ని పరిస్థితులు సర్దుకున్నాకే ఇంటికి వెళ్తానని హామీ ఇచ్చినట్లుగానే ..చంద్రబాబు పదిరోజులు విజయవాడలోనే ఉండి సహాయక చర్యలను పరుగులు పెట్టించిన చంద్రబాబు పనితీరుపై బాధితులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.