హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఇవాళ పాల్గొబోతున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు పరస్పరం విమర్శలు చేసుకుంటారా లేదా అనేదానిపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీగిపోయింది. కేసీఆర్ చంద్రబాబుపై నిర్ద్వంద్వంగా విమర్శలు గుప్పించారు. గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకుని ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. అనేక అంశాలపై విస్తృతంగా స్పందించారు… ప్రశ్నలకు జవాబులిచ్చారు. చంద్రబాబు నాయుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రావటం అసంబద్ధం, వృథా ప్రయాస అని కేసీఆర్ అన్నారు. ఆయనకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. ఆయన తొమ్మిదేళ్ళ పాలనలో సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని అడిగారు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం దాకా ఆయనకు ఊడ్చుకోవటానికి 13 జిల్లాలున్నాయంటూ ఎద్దేవా చేశారు.
తాను గతంలో ఆంధ్రావాళ్ళను రాక్షసులని అన్నమాట వాస్తవమేనని విమర్శించారు. అయితే తెలంగాణను వ్యతిరేకించినవారినే తాను రాక్షసులని అన్నామని చెప్పారు. పైగా టీఆర్ఎస్ నాడు ఉద్యమ పార్టీ అని, ఇప్పుడు రాజకీయ పార్టీ అని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తెలంగాణ బిడ్డలేనని చెప్పారు. గత 18 నెలల పాలనలో హైదరాబాద్‌లో చీమ కూడా చిటుక్కు్మనిలేదని అన్నారు. నాలుగు ఓట్లకోసం హైదరాబాద్ ప్రశాంతతను దెబ్బతీయొద్దని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. అన్ని సంక్షేమ పథకాలను అందరికీ సమానంగా అందిస్తామని అన్నారు. మూసీ, హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళన చేసి చూపిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐదారేళ్ళలో అద్భుతమైన నగరంగా చేసి చూపిస్తామని అన్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మించి తీరుతామని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో రెండు టవర్స్ నిర్మిస్తామని కేసీఆర్ అన్నారు. జంట నగరాలలో రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఐలాండ్ పవర్ సప్లయ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరో రెండు మంచినీటి రిజర్వాయర్లు నిర్మిస్తామని అన్నారు. గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగరబోతోందని, దానిని ఎవరూ ఆపలేరని చెప్పారు. గ్రేటర్ ఓటర్లు టీఆర్ఎస్ను గెలిపించాలని, నగర ప్రజలు ఓటింగ్ శాతం పెంచాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.