ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేదలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకు రావడానికి ఓ సామాజిక యుద్ధం ప్రారంభిస్తున్నారు. ఓ కుటుంబం పైకి రావాలంటే వారికి చాలా విషయాల్లో మార్గదర్శనం, సహకారం అవసరం ఉంటుంది. ఆర్థికపరమైన అవగాహనలేకపోవడం, విద్య లేకపోవడం, ప్రపంచంలో వస్తున్న మార్పులపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా పేద కుటుంబాలు ఎదగలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన చంద్రబాబు చేసిన వినూత్న ఆలోచన P4.
మార్గదర్శి – బంగారు కుటుంబం అని ఈ పథకానికి పేరు పెట్టారు. ప్రభుత్వం నేరుగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు. కేవలం పెద్దలు, పేదల మధ్య అనుసంధాన కర్తగా ఉంటుంది. పేద కుటుంబాన్ని బంగారం కుటుంబంగా భావిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్న వారిని మార్గదర్శిగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పేదలైన ఇరవై శాతం కుటుంబాలను ఇందులో భాగం చేసి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకు రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
పేదలకు ప్రభుత్వ పథకాలు ఏడాదికి లక్షలు ఇచ్చినా వారు పేదరికం నుంచి బయటకు రాలేకపోతున్నారు. అయితే వారికి ఇవ్వాల్సింది నగదు మాత్రమే కాదు కాదని అంతకు మించి ఉందని చంద్రబాబు నమ్ముతున్నారు. ఓ కుటుంబంలో అన్ని విషయాల్లో చైతన్యం తీసుకు వస్తే.. అది వారిని విద్యాపరంగా, ఆర్థిక పరంగా వృద్ధిలోకి తెస్తుందని చంద్రబాబు నమ్ముతారు. పీ ఫోర్ పథకం ఉద్దేశం ఆకలైన వారికి ఓ బియ్యం బస్తా ఇవ్వడం కాదు. ఆకలి వేయకుండా ఎవరికి వారు సంపాదించుకునేలా వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడం… సమాజంలో మెరుగైన స్థానానికి తీసుకెళ్లడం.
చంద్రబాబుపై నమ్మకంతో కొంత మంది ఆర్థికంగా స్థిరపడిన వారు.. పేద కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వస్తారు. పేద కుటుంబాలను ఇప్పటికే ఎంపిక చేశారు. మొదటి దశలో ఈ పథకం ప్రయోజనాన్ని రెండు వర్గాలు గుర్తించి విజయం సాధించేలా చేస్తే.. ఈ పథకం ముఖ్య ఉద్దేశానికి ఓ సార్థకత లభిస్తుంది. చంద్రబాబు ప్రయత్నాలు విజయవంతమయ్యేందుకు ఓ మార్గం ఏర్పడుతుంది.