ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోందని.. జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. అంత ఎంత స్థాయిలో ఉంటుంది… చాలా పెద్దగా ఉంటుందా… చిన్నగా ఉంటుందా.. అనేది.. చంద్రబాబు చేతుల్లో ఉంటుందట. చంద్రబాబు ఆలోచనలే కీలకమని… జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. కడప జిల్లాకు వెళ్లిన ఆయన.. అక్కడ మీడియాతో… ఈ చిత్రవిచిత్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎదుగుదల వెనుక చంద్రబాబు పరోక్షపాత్ర ఉందని తేల్చేస్తున్నారు. జమిలీ ఎన్నికలంటూ జరిగితే.. ప్రాంతీయ పార్టీలన్నీ నిర్వీర్యం అవుతాయని జోస్యం చెప్పారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని చెప్పుకునే జేసీ… బీజేపీ ఎదుగుదలకు.. చంద్రబాబుకు లింక్ ఎక్కడో మాత్రం బయట పెట్టలేదు.
కొద్ది రోజుల క్రితం… జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా.. ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు ఆలోచనలు.. బీజేపీకి చాలా అవసరమన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు. సీనియర్ జేసీ ఈ బాధ్యత తీసుకున్నారు. గత వారం.. అమరావతి సెక్రటేరియట్ కు వచ్చిన జేసీ.. జగన్ ను మావోడని.. ఓన్ చేసుకుని.. వంద రోజుల పాలనకు వంద మార్కులేశారు. ఇప్పుడు మాత్రం.. వంద రోజుల పాలనపై ఏడాది తర్వాత మాట్లాడతానని చెప్పుకొచ్చారు. కొన్నాళ్లుగా.. టీడీపీ తరపున.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు.. జేసీ కుటుంబీకులు ఆసక్తి చూపించడం లేదు. వివిధ రకాల ఒత్తిళ్లు వస్తూండటంతో.. వీలైనంత దూరం పాటిస్తున్నారు.
రాయలసీమ టీడీపీ నేతలు.. ముఖ్యంగా కాస్త ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న వారు…జగన్ సీఎం అయ్యే సరికి ఆందోళన చెందుతున్నారు. భద్రత కోసం.. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరడం మినహా… మరేం చేయలేమన్నట్లుగా ఉన్నారు. అందుకే రాయలసీమ టీడీపీ నేతలు .. భారతీయ జనతా పార్టీ వైపు చూడటం ఎక్కువయ్యింది. ఆదినారాయణరెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. జేసీ సోదరులు కూడా అదే బాటలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకారమే…. జేసీ సోదరుల ప్రకటనలు ఉన్నాయని భావిస్తున్నారు.