ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో ప్రచారం చేయడం, ఫిర్యాదులు ఉంటే స్వీకరించి, వెంటనే పరిష్కార మార్గాలు చూపించడం ఈ కార్యక్రమం లక్ష్యం. నిజానికి, ఒకవేళ సమస్యలను గుర్తించడం ఒక్కటే ఈ కార్యక్రమ లక్ష్యం అయితే, ఆ పని మండల స్థాయి ప్రభుత్వాధికారులు ద్వారా చూడా చెయ్యొచ్చు. కానీ, దీన్ని ఓ భారీ ప్రచార కార్యక్రమంగా తీర్చిదిద్దడంతో ఇదో పార్టీ కార్యక్రమం అయిపోయింది. ఎంతగా అంటే… ఆ పార్టీ అనుకూల మీడియాలో అయితే ‘సమరభేరి మోగింది’ అంటూ కథనాలు రాసేస్తున్నారు. ఏడాదిన్నర ముందే రణభేరి మోగిందని, ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టిందనీ, కార్యక్రమం దిగ్విజయం సాధించిందనీ, కోటి ఇళ్లను సందర్శించడమే టీడీపీ లక్ష్యం అని కథనాలు గుప్పిస్తున్నారు.
టీడీపీ సర్కారు చేపడుతున్న ఇంటింటికీ కార్యక్రమం ద్వారా ప్రజల అవసరాలు తెలుసుకోవడంతోపాటు, ప్రజా వ్యతిరేకతను కనిష్ఠ స్థాయికి తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం అని సదరు కథనంలో విశ్లేషించారు. తటస్థ ఓటు తెలుగుదేశం పార్టీకి పడేలా చేయడం ద్వారానే నంద్యాలలో కూడా విజయం సాధించారనీ, ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారట! ఎన్నికలు వచ్చే ముందు తొందరపడే కంటే, ఇలా ముందుగానే ప్రజల్లోకి వెళ్లడం అనేది సరైన వ్యూహం అవుతుందని భావిస్తున్నారట. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంపై దాదాపు నాలుగు గంటలపాటు సీఎం సమావేశం నిర్వహించారు. మొదట 50 రోజులు మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుందని ప్రారంభించారు. కానీ, దీన్ని మరో పదిరోజులపాటు పెంచారు. ఇంకా అవసరం అనుకుంటే 75 రోజులపాటు కార్యక్రమం జరుగుతుందనీ, నియోజక వర్గంలోని ప్రతీ ఇంటికీ టీడీపీ నేతలు వెళ్లాలని సీఎం స్పష్టం చేయడం విశేషం.
నిజానికి, ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా సాధిస్తున్నది ఏముంది..? ప్రజా ప్రతినిధులు సాధారణ సమయాల్లో నిర్వహించాల్సిన బాధ్యతలే ఇవి. ప్రభుత్వ పథకాల అభివృద్ధి గురించి తెలుసుకోవడం, లబ్ధిదారులకు అందకపోతే వెంటనే చర్యలు తీసుకోవడం, పెన్షన్లు, రేషన్ కార్డులు ఏవైనా కొత్తవి ఇవ్వాల్సి ఉన్నాయా అని సరిచూసుకోవడం, ఫిర్యాదులు తీసుకోవడం… ఇవన్నీ చాలా సర్వసాధారణమైన బాధ్యతలు. అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని చుట్టూ తిరగడం ఎక్కువౌతోంది కాబట్టి, సొంత నియోజక వర్గాలకు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇదేదో కొత్త కార్యక్రమంగా కనిపిస్తోంది. దీన్ని ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంగా డిజైన్ చేశారు కాబట్టే ఇంత హడావుడి. వాస్తవంగా ఆలోచిస్తే దీన్లో కొత్తదనం ఏదీ లేదు. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా సదరు మీడియా బృహత్తర కార్యక్రమంగా అభివర్ణించేస్తే ఎలా చెప్పండీ! అధికార పార్టీ కార్యక్రమం కాబట్టి ఆమాత్రం హడావుడి ఉంటుంది. అంతేగానీ, దీన్నే సమరభేరి అనీ, వ్యతిరేకత తగ్గింపు వ్యూహమనీ, సమస్యల పరిష్కారానికి సంజీవని అనే స్థాయిలో చెబుతుంటే ఎలా..?