తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ప్రచారంలో రోజుకో అంశాన్ని ప్రణాళికాబద్ధంగా హైలెట్ చేసుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోలేని అనేక అంశాలు చంద్రబాబు ప్రచారాస్త్రాలుగా మారాయి. ముఖ్యంగా..టీఆర్ఎస్తో కలిస్తే తప్పేమిటంటూ.. జగన్ చేస్తున్న ప్రకటనలతో… తెలంగాణ నుంచి ఏపీకి పొంచి ఉన్న ముప్పును… ప్రజలకు తెలియచెప్పేందుకు చంద్రబాబు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎగువ రాష్ట్రమైన తెలంగాణ తో నీటి విషయంలో.. ప్రాజెక్టుల విషయంలో గట్టిగా ఉండకపోతే.. ఏర్పడే పరిస్థితులను వివరిస్తున్నారు.
ఎగువ ప్రాంతంలో.. కృష్ణా, గోదావరిపై… తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా.. నిర్మిస్తున్న వైనాన్ని .. వివరిస్తున్నారు. కేసీఆర్ ను చూస్తేనే జగన్ కు తడిచిపోతుందని..ఏపీకి అన్యాయం జరుగుతున్నా.. పట్టించుకోని స్థితికి వెళ్లారని గుర్తు చేస్తున్నారు. అలాగే.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ తమకే కావాలని వాదిస్తున్న వైనం కూడా.. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. శ్రీశైలం మీదక అజమాయిషీ కోల్పోతే.. రాయలసీమకు చుక్క నీరు రాదనే సంగతిని గుర్తు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడును మూసి వేయాలన్నదే… కేసీఆర్ ప్లాన్ అని.. అదే జరిగితే రాయలసీమ ఎడారి అవుతుందన్న విషయాన్ని చంద్రబాబు.. రాయలసీమ రైతులకు అర్థమయ్యేలా చెబుతున్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి కేటాయింపులు లేవని.. వాదిస్తున్న తెలంగాణ వైఖరిని.. ఖండించడానికి జగన్మోహన్ రెడ్డి సంశయించడం.. మరిన్ని విమర్శలకు తావిస్తోంది.
ఇక ఏపీ నుంచి కరువును తరిమికొట్టే మహత్తర ప్రాజెక్టు పోలవరంను ఆపాలని.. సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్లపై కూడా.. చంద్రబాబు తన ప్రసంగాల్లో ప్రముఖంగా చెబుతున్నారు. దమ్ముంటే.. వీటిపై..సమాధానం చెప్పాలని.. అటు జగన్ కు.. ఇటు కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేలా… పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు.