హైదరాబాద్: సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన జేసీ దివాకర్ రెడ్డి రాయలసీమకు అన్యాయం జరిగిందంటున్నవారిపై విరుచుకుపడ్డారు. రాయలసీమకు అన్యాయం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. రాజకీయ నిరుద్యోగులు ఈ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని తాను విభజనకు ముందు ప్రతిపాదించానని, అది చేసి ఉంటే సీమకు ఈ కష్టాలు వచ్చేవికాదని అన్నారు. ఇప్పుడు గొడవ చేస్తున్నవారెవరూ అప్పుడు తనకు మద్దతియ్యలేదని చెప్పారు. ఇప్పుడు సీమకోసం ఉద్యమిస్తున్నవారంతా తిరస్కరింపబడిన నాయకులేనని, ఉనికికోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి బాగా ఆలోచిస్తున్నారని, నీళ్ళకోసంకూడా విశ్వప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అయితే ఆయన శాపగ్రస్తుడని, వరుణుడు కరుణించకపోవటం చంద్రబాబుకు శాపమని జేసీ అన్నారు.
ప్రత్యేకహోదా రాదని సీఎం, పీఎం, ఏపీకి చెందిన కేంద్రమంత్రులు… అందరికీ తెలుసని దివాకర్ చెప్పారు. ప్రజలను మభ్యపెట్టటం సరికాదని సూచించారు. హోదా కోసం చంద్రబాబు విశ్వప్రయత్నం చేశారని అన్నారు. టీడీపీ, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకోవటం మంచిది కాదని హితవు పలికారు. ఏపీలో బీజేపీకి క్యాడర్ లేదని, ఎక్కువ బలం ఉందని ఊహించుకుంటున్నారని జేసీ అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు, అటు కేసీఆర్కు కూడా గుణపాఠమని చెప్పారు.