జాతీయ రాజకీయాల గురించి మాత్రమే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. తెరాసకు 16 ఎంపీ సీట్లు వస్తే చాలు, అవతల దేశంలో నూట యాభై దాకా మోపు చేసి ఉంచానని చెప్తూ వస్తున్నారు. నిన్నటికి నిన్న కేటీఆర్ కూడా అదే మాట చెప్పారు. ఇతర ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ తో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట చాలామంది ఉన్నారు అనేది మాటల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటే…. ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు అదే పనిని చేతల్లో చూపిస్తున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారానికి టీడీపీకి మద్దతుగా జాతీయ నేతలు రావడం మొదలైంది. ముందుగా ఫరూక్ అబ్దుల్లా వచ్చారు. ఎన్టీఆర్ జమానాలో కూడా ఆయన టీడీపీకి అనుకూలంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజా పర్యటనలో ఆయన ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే ప్రసంగించారు.
ఈ నెలాఖరున మమతా బెనర్జీ ఆంధ్రా పర్యటనకు వస్తున్నారు. ఆ తరువాత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వస్తున్నారు. దేవెగౌడ కూడా వస్తారని సమాచారం. వీరితోపాటు ఇతర ప్రముఖ పార్టీలకు చెందినవారు కూడా టీడీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల ప్రముఖ నేతలు రావడం వల్ల టీడీపీ ప్రచారానికి కొత్త కలర్ వచ్చిందనే చెప్పాలి. జాతీయ రాజకీయాల మూడ్ లో కూడా టీడీపీ ఉందనే సంకేతాలు వ్యక్తమౌతాయి. భాజపాకి వ్యతిరేకంగా కూటమి ప్రయత్నాలు ఈ పార్టీల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కూటమి ఉందా లేదా అనే చర్చ మొదలైన సమయంలో… ఏపీకి నాయకులు వస్తుండటంతో, చంద్రబాబు వెంట ఇతర పార్టీలు ఉన్నాయనే అభిప్రాయం కలుగుతుంది. నిజానికి, భాజపా వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాల్లో జాతీయ స్థాయిలో మొదట్నుంచీ చొరవ చూపిస్తున్నది కూడా చంద్రబాబు నాయడే.
ఏపీకి జాతీయ నేతలు ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రెంట్ పరిస్థితి ఏంటనే చర్చ మళ్లీ తెరమీదికి వస్తుంది. 150 నుంచి 170 మంది ఎంపీలు తమతో పాటు ఫెడరల్ ఫ్రెంట్ కి సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటప్పుడు, కేసీఆర్ వెంట ఉండాలనుకుంటున్న సదరు పార్టీల నాయకులు తెలంగాణకు వచ్చి లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చెయ్యొచ్చు కదా? ఆ నాయకుల్ని ప్రచారానికి తీసుకొస్తే… కేసీఆర్ చెబుతున్న అంచనా నంబర్లకు కొంత బలం చేకూరుతుంది కదా. జాతీయ రాజకీయాల వ్యూహంలో కేసీఆర్ కంటే చంద్రబాబు ఒక అడుగు ముందే ఉన్నారనడంలో సందేహం లేదు. దానికి ఉదాహరణే… వరుసగా ఏపీకి ప్రచారానికి వస్తున్న జాతీయ నేతలు వస్తున్న తీరు. మరి, ఇప్పుడైనా ఈ ట్రెండ్ గమనించి కేసీఆర్ కూడా ఇదే తరహాలో ఏదైనా ప్రయత్నిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే, చంద్రబాబుకి రిటర్న్ గిప్టు వెనక ఉన్నది… కేసీఆర్ జాతీయ రాజకీయ కలలే కదా?