అనుకున్నట్టుగానే అంతా జరుగుతోంది…! ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల అవకతవకలన్నీ చుట్టూ తిరిగి రాష్ట్రం ప్రభుత్వం నిర్వాకమే ఇదంతా అని నిర్ధారణకు వచ్చేసింది వైకాపా పత్రిక. చోటు చేసుకున్న ఘటనలన్నింటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంటూ వేలెత్తి చూపుతోంది. ఈవీఎం మొరాయింపులు, ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభం, కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత… ఇవన్నీ చంద్రబాబు చేయించిన కార్యక్రమాలే అని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. ఇవాళ్టి సాక్షి పత్రికలో… మొరాయింపు కుట్రపై సీరియస్ అంటూ ఓ కథనానికి బాగా మసాలా దట్టించి అచ్చేశారు. పోలింగ్ జాప్యానికి కారణం చంద్రబాబు నాయుడే అని ఈసీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని సాక్షికి మాత్రమే తెలిసినట్టు రాశారు. ఈసీ ఆగ్రహంగా ఉందని వారికి తెలిసిందట!
ఓటింగ్ ఎందుకు ఆలస్యంగా ప్రారంభమైందని ఈసీ సునిశితంగా పరిశీలించిందనీ, ఓటింగ్ శాతాన్ని గణనీయంగా తగ్గించడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని ఈసీ నిర్ధారణకు వచ్చినట్టు సాక్షి తీర్మానించేసింది! ఉద్దేశపూర్వకంగానే పెద్ద ఎత్తున ఈవీఎంలు పనిచేయడం లేదంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారని భావిస్తున్నారట! ఆధారాల సేకరణలో ఈసీ ఉందట. అంతేకాదు, ఆర్వోల ఎంపిక వెనక కూడ పెద్ద కుట్ర ఉన్నట్టుగా, పార్టీలో అందరూ చర్చించుకున్నాకనే వారిని ఎంపిక చేసి.. ఆ జాబితాను ఈసీకి పంపించారని రాశారు. అందుకే, రిటర్నింగ్ అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేశారట. అయితే, ఇదే సమయంలో కొంతమంది ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేయడంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారనీ, చివరికి శాంతిభద్రతల సమస్యకు కూడా ఆయనే కారణమని సాక్షి తేల్చేసింది. అంటే, చంద్రబాబు నాయుడు గెలిస్తే… ఇన్ని అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి గెలిచారనే వాదనకు ఇది సరిపోతుందిలెండి..!!
ఏదేమైనా, చంద్రబాబును ఈసీ టార్గెట్ చేసుకుందనడానికి సాక్షి కథనం ఓ సాక్ష్యంగా చూసుకోవచ్చు. ఎందుకంటే, ఈసీకి అనధికార ప్రతినిధులుగా వైకాపా నేతలు, ఈ పత్రిక వ్యవహరిస్తోంది కాబట్టి! ఈ కథనంలో రాసినట్టు ఓటింగ్ శాతం తగ్గించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటే… పోలింగ్ రోజున మీడియా ముందుకు వచ్చి, ఆలస్యమైనా సరే ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎందుకు పిలుపునిస్తారు? ఒకవేళ టీడీపీకి అనుకూలంగా ఓట్లు పడటం లేదనుకుంటే… ఓటింగ్ శాతం పెంచేందుకు ఆయనెందుకు ప్రయత్నిస్తారు? టీడీపీ శ్రేణులన్నీ పోలింగ్ కేంద్రాలకు ఓట్లేసేలా ప్రజలను ఎందుకు తీసుకొస్తారు..? ఎన్నికల సంఘం అధికారంలో రాష్ట్రం ఉన్నప్పుడు, సీఎస్ ని మార్చేసి, డీజీపీని కట్టడి చేస్తున్నప్పుడు… శాంతిభద్రతలు చంద్రబాబు నియంత్రణలో ఉన్నట్టా, లేదా సీఈవో నియంత్రణలో ఉన్నట్టా..? నిన్నేమో అధికారులదే తప్పంతా అన్నట్టుగా సాక్షి గొంతు మార్చింది. ఇవాళ్ల మళ్లీ గొంతు సవరించుకుని… దానికి కారణం చంద్రబాబు నాయుడే అంటోంది. ఓ పక్క ఈసీ, ఇంకోపక్క సాక్షి… ఈ రెండూ నిన్నట్నుంచీ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు వైపు వేలు చూపేలా గట్టిగా ప్రయత్నం మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నాయి.