ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణా రాష్ట్ర రాజకీయాలలో నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లున్నారు. ఎన్నడూ తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టని జగన్మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు. తెలంగాణాలో తన పార్టీ బాధ్యతలను అక్కడి నేతలకే అప్పగించి, రాష్ట్రంలో పార్టీ బలపడటానికి అవసరమయిన కార్యక్రమాలను, ఎన్నికలలో తెరాసను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలనే నిర్ణయించుకోమని చెప్పడం గమనిస్తే, ఆయన ఇకపై తెలంగాణా వ్యవహారాలలో జోక్యం చేసుకోబోరని అర్ధం అవుతోంది.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏర్పడిన స్నేహాన్ని నిలుపుకోవడానికే ఆయన తన పార్టీని పణంగా పెడుతున్నారా లేకపోతే వైకాపా ఆరోపిస్తున్నట్లు ఓటుకి నోటు కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కుదిరిన రహస్య అవగాహన కారణంగానే తెలంగాణా రాజకీయాలకు, తన పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారో తెలియదు. కానీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో తన పార్టీ నేతలను ఏవిధంగా రోడ్డున పడేసి ఆంధ్రాకు తరలిపోయారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇంచుమించు అదేవిధంగా తెలంగాణాలో తెదేపాను వదిలిపెడుతున్నట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని భావించినట్లయితే, పార్టీ నేతల మధ్య సఖ్యత లోపించినందున తెదేపా విచ్చినం అయిపోవచ్చును. అప్పుడు పార్టీ నేతలు ఒకరొకరుగా ఇతర పార్టీలలోకి తరలిపోవచ్చును. క్రమంగా రాష్ట్రంలో తెదేపా కనబడకుండా పోవచ్చును. అండమాన్ నికోబార్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఓడిశా రాష్ట్రాలకు తెదేపాను వ్యాపింపజేసి వచ్చే ఎన్నికల నాటికి తెదేపాను జాతీయ పార్టీగా మలచాలని ఏర్పాట్లు చేసుకొన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో బలంగా ఉన్న తన పార్టీనే వదులుకొనేందుకు సిద్దపడటం చాలా ఆశ్చర్యంగా ఉంది.
“త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలా వద్దా? అనే విషయం మీరే నిర్ణయించుకోండి. అలాగే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో విజయం సాధించడానికి ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలో మీరే నిర్ణయించుకోండి,” అని చంద్రబాబు నాయుడు తనను కలిసిన పార్టీ నేతలకి చెప్పినట్లు తెలుస్తోంది. అంటే తెలంగాణా రాజకీయాలకు, పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉండాలనుకొంటున్నట్లు అర్ధమవుతోంది.
చంద్రబాబు నాయుడు తెలంగాణాలో తెదేపాను ఇదివరకులాగే పటిష్టంగా ఉంచాలనుకొంటే పార్టీ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షించవలసి ఉంటుంది. లేకుంటే తన పార్టీని తెరాస దయాదాక్షిణ్యాలకి వదిలిపెట్టేయాలని నిర్ణయించుకొన్నట్లు భావించాల్సి ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలలో ఇకపై కలుగజేసుకోకపోయినా తెదేపా నేతలు పార్టీని నిలబెట్టుకోవాలనుకొంటే ముందు వారందరి వైఖరిలో చాలా మార్పు రావాల్సి ఉంటుంది. పార్టీలో అందరూ తమ భేషజాలను, భేదాభిప్రాయాలను పక్కనబెట్టి కలిసికట్టుగా ఒక వ్యూహ ప్రకారం పనిచేయవలసి ఉంటుంది. కానీ తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో స్నేహం చేస్తుంటే, వాళ్ళు కేసీఆర్ తో పోరాడటం చాలా విచిత్రంగా ఉంటుంది కనుక తమ పోరాటాలతో తెలంగాణా ప్రజలను మెప్పించడం సాధ్యకాకపోవచ్చును.