కేంద్రంలో మరోసారి ఏర్పడబోయే ఎన్డీయే కూటమిలో టీడీపీ ప్రాతినిధ్యం కీలకం కావడంతో ఈ అవకాశాన్ని ఏపీ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. బీజేపీ కూడా టీడీపీ విషయంలో సానుకూల ధోరణిని అవలంభించనుండటం ఖాయం. కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రి పదవులను చంద్రబాబు కోరినా అందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. దీంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని చనద్రబాబు భావిస్తున్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం నేపథ్యంలో బుధవారం ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు కేంద్రమంత్రివర్గంలో రాష్ట్ర ప్రాతినిధ్యంపై మోడీతో చర్చించినట్లుగా తెలుస్తోంది. రెండు కేబినెట్ మంత్రి పదవులతో పాటు మరో రెండు సహాయ మంత్రి పదవులు , స్పీకర్ పదవిని ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ కేంద్రాన్ని ఒప్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగూ ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ వ్యతిరేకించే అవకాశం లేదు. కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా , పోలవరం ప్రాజెక్టు పూర్తితోపాటు విశాఖ ఉక్కు, రైల్వే జోన్ ను సాధించుకోవాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబు సారధ్యంలో ఏపీ అభివృద్ధిలో పరుగులు పెట్టనుండటం ఖాయంగా కనిపిస్తోంది.