విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ గనుల తవ్వకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జి.ఒ. గురించి తనకు తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అది గనులు, అటవీ శాఖలు కలిసి తీసుకొన్న నిర్ణయమని మీడియాతో అన్నారు. బాక్సైట్ తవ్వకాల ద్వారా ఇరుగు పొరుగు రాష్ట్రాలు భారీగా ఆదాయం సమకూర్చుకొంటున్నాయని ఆయన అన్నారు. ఆయన చెప్పిన ఈ మాటలు వింటే బాక్సైట్ తవ్వకాలపై ఆయన అభిప్రాయం ఏమిటో అర్ధం అవుతోంది. తనకు తెలియకుండా జి.ఒ. విడుదల అయిందని చంద్రబాబు నాయుడు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడానికేనని అర్ధమవుతోంది. బాక్సైట్ తవ్వకాల ద్వారా వచ్చే రాబడి కోసమే ఆయన ఆలోచిస్తున్నారని స్పష్టం అవుతోంది.
బాక్సైట్ తవ్వకాలలో స్థానిక గిరిజనులకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతోనే బాక్సైట్ తవ్వకాల గురించి తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని, కనుక గిరిజనులతో అన్ని విషయాలు మాట్లాడిన తరువాతే దానిపై ముందుకు వెళతామని చంద్రబాబు నాయుడు అన్నారు. బాక్సైట్ పై వచ్చే ఆదాయం గురించి మాట్లాడిన తరువాత మళ్ళీ బాక్సైట్ తవ్వకాల ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నామని ఆయన చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ గిరిజనులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం అంతగా తపించిపోతుంటే బాక్సైట్ తవ్వకాలకు బదులు అక్కడ వారికి ప్రత్యామ్నాయ ఉపాది అవకాశాలు చూపిస్తే అందరూ హర్షిస్తారు. కానీ అడవులలో స్వేచ్చగా బ్రతుకుతున్న వారిని పట్టుకొని బాక్సైట్ తవ్వకాలలో వెట్టి చాకిరీ చేయించుకొని చివరికి వారిని రోగులుగా మార్చడం తప్ప మరేమీ సాధ్యం కాదు. బాక్సైట్ తవ్వుకొని కార్పోరేట్ కంపెనీలు కోట్లు సంపాదించుకొంటే, ఆ గనులలో దుమ్ము దూళీ మధ్య గిరిజనులు జీవచ్చవాలుగా మారి చివరికి ఆ గనుల్లోనే ప్రాణాలు కోల్పోతారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలన్నిటికీ గత ప్రభుత్వాన్ని తప్పు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాక్సైట్ తవ్వకాలో విషయంలో మాత్రం గత ప్రభుత్వం యొక్క అడుగుజాడలలోనే నడుస్తామని చెప్పడం విశేషం. ప్రభుత్వాలు ఒక్కోసారి అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవచ్చును. అదేమీ నేరం కాదు. కానీ అది తప్పు.. దానిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిసిన తరువాత కూడా మొండిగా ముందుకు వెళ్ళడమే తప్పు. కనుక బాక్సైట్ తవ్వకాల విషయంలో ప్రజాభిప్రాయాన్ని మన్నించి పునరాలోచించుకొంటే అన్ని విధాల మంచిది. ఇప్పటికే రాజధాని కోసం, పోర్టు, విమానాశ్రయాల కోసం వేల ఎకరాలు భూసేకరణ చేస్తున్నందుకు తెదేపా ప్రభుత్వం రైతులలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొంది. ఇప్పుడు ఈ బాక్సైట్ కోసం గిరిజనుల భూములు కూడా స్వాధీనం చేసుకొనే ప్రయత్నిస్తే ప్రజలలో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది.