చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అంటూ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) సోమవారం ఢిల్లీలో ఓ నివేదిక విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్లు విలువ చేసే ఆస్తులతో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత పేద ముఖ్యమంత్రి. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు రూ. 332 కోట్లకు పైగా విలువ చేసే మొత్తం ఆస్తులతో రెండో స్థానంలోఉన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ రూ. 118 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు రూ. 10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
ఏడీఆర్ ప్రత్యేకంగా ఎలాంటి ప్రత్యేక సమాచారంతో ఈ నివేదిక విడుదల చేయలేదు. కేవలం ఎన్నికల అఫిడవిట్లలో ఉన్న సమాచారాన్ని మాత్రమే వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు స్థిర, చరాస్తులు కలిపి రూ. 36 కోట్లుగా నిర్దారించారు. కానీ ఆయన భార్య భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీలో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. ఆ కంపెనీ మంచి పనితీరు కనబరుస్తోంది. దేశవ్యాప్తంగా డెయిరీ వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తోంది. ఈ కారణంగా షేర్ వాల్యూ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ షెర్ వాల్యూ పెరగటం వల్ల చంద్రబాబు కుటుంబ ఆస్తులు భారీగా పెరిగినట్లుగా ఏడీఆర్ నివేదిక చెబుతోంది.
ఆరు నెలల కిందట ఎన్నికల అఫిడవిట్ సమర్పించేనాటికి హెరిటేజ్ షేర్ ధర 337 రూపాయలు ఉంది. ఇవాళ అది 479 రూపాయలు అయింది. ఈ కారణంగానే ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లయింది. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏపీ రిచ్చెస్ట్ సీఎం జాబితాలో ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఇక్కడ నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించేవారే ఉంటారు. హెరిటేజ్ కంపెనీ మూడున్నర దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొంది. జగన్ రెడ్డి కంపెనీలకు కనీసం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అర్హత కూడా లేదు. అవన్నీ బినామీ పేర్లు, సూట్ కేసు కంపెనీల పేర్లతో ఉండే ఆస్తులు. అందుకే జగన్ నిర్మోహమాటంగా తనకు టీవీలు, పేపర్లు లేవని చెప్పుకుంటూ ఉంటారు.