పట్టిసీమ-పోలవరం ప్రాజెక్టులపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మధ్య చాలా తీవ్రమయిన మాటల యుద్ధం జరిగింది. కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, కృష్ణా మొదలయిన జిల్లాలకి నీళ్ళు అందించగల ఆత్యద్భుతమైన ప్రాజెక్టు పట్టిసీమ అని చంద్రబాబు నాయుడు చెప్పుకొంటే, నీళ్ళను ఉంచుకొనేందుకు స్టోరేజి సౌకర్యం లేని పట్టిసీమ ఒక పిచ్చి ప్రాజెక్టు, దాని కోసం రూ.1,600 కోట్ల ప్రజాధనం నీటిపాలు చేసేరని జగన్ విమర్శించారు.
దానికి చంద్రబాబు నాయుడు బదులిస్తూ రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లు, పట్టిసీమ గురించి నేను చెప్పిందంతా విన్న తరువాత మళ్ళీ నీళ్ళకి స్టోరేజి లేదని జగన్ వితండవాదం చేస్తున్నాడని విమర్శించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టుకొని అన్ని జిల్లాలకు పారించి ఎక్కడికక్కడ స్టోరేజి చేసుకోవచ్చును. దేనిగురించయినా మాట్లాడేముందు సబ్జెక్ట్ తెలుసుకొని, అర్ధం చేసుకొని మాట్లాడితే మంచిది,” అని చంద్రబాబు బదులిచ్చారు.
అప్పుడు జగన్ కూడా చాలా ఘాటుగా విమర్శలు గుప్పించారు. “తెలియని వ్యక్తికి చెప్పవచ్చును. తెలిసిన వ్యక్తితో మాట్లాడవచ్చును. కానీ అన్నీ నాకే తెలుసనుకొనే అజ్ఞానితో మాట్లాడటం కష్టం. చంద్రబాబు పరిస్థితి కూడా అదే. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి డా. రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు కుడికాలువ త్రవ్వించబట్టే ఈనాడు దానిలో ఇన్ని నీళ్ళు పోసి అదేదో చాలా గొప్ప విషయం అన్నట్లు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. 180 టి.ఎం.సి. ల నీళ్ళు అవసరమయిన కృష్ణ డెల్టాకి ఈయన కేవలం 4 టి.ఎం.సి. ల నీళ్ళు అందించి, మొత్తం డెల్టాని కాపాడేసినట్లు గొప్పలు చెప్పుతుంటే మేమందరం చెవులలో పువ్వులు పెట్టుకొని వింటూనే ఉంటాము,” అని ఎద్దేవా చేసారు.
దానికి చంద్రబాబు నాయుడు బదులిస్తూ “రాయలసీమలో ప్రతీ జిల్లాకు నీళ్ళు అందించాలని మేము పరితపిస్తుంటే, ఏదేదో అర్ధం పర్ధం లేకుండా నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతూ జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. జగన్ అడ్డు పడినా, వైకాపా ఎమ్మెల్యేలే అడ్డుపడినా రాయలసీమలో ప్రతీ జిల్లాకి, గ్రామానికి పట్టిసీమ ద్వారా నీళ్ళు పారించి తీరుతాము. వైకాపా ఎమ్మెల్యేల నియోజక వర్గాలకి కూడా వారు అడ్డుపడినా నీళ్ళు పారించి తీరుతాము. ఒకవేళ అడ్డుపడితే అదే విషయం ప్రజలకి కూడా చెపుతాము,” అని అన్నారు.