రాష్ట్రపతిగా ఒక దళిత అభ్యర్థిని అనూహ్యంగా భాజపా తెరమీదికి తెచ్చింది. ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతును కూడగట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకీ ఫోన్ చేశారు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికీ ఫోన్ చేశారు. ఇద్దరూ అన్ కండిషనల్ గా మద్దతు ప్రకటించారు. మా పరిపూర్ణ మద్దతు ఎన్డీయే అభ్యర్థికే ఉంటుందని ఎవరికివారు ప్రధానితో చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పబట్టరు. కానీ, ఈ క్రమంలో చంద్రబాబుగానీ, జగన్మోహన్ రెడ్డిగానీ నరేంద్ర మోడీకి పూర్తిగా సరెండ్ అయిపోయారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కావాలని ప్రధాని వీరిని కోరినప్పుడు… ఏపీ ప్రయోజనాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించినట్టు లేరు! ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకూ రాష్ట్రపతి ఎన్నిక మద్దతుకూ లింక్ పెట్టి ఉంటే బాగుండేది కదా. ఈ అంశంపై కేంద్రం కచ్చితంగా సానుకూలంగా స్పందించే అవకాశాన్ని ఈ ఇద్దరూ జారవిడిచారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక హోదాను వదల్లేదని కాసేపు… దానికంటే ప్యాకేజీయే సూపర్ అని మరికాసేపు.. ఇలా చంద్రబాబు నాయుడు నాన్చుతూ వచ్చి, చివరికి కేంద్రం ఏదిస్తే అదే మహాప్రసాదం అనేశారు. ఇక, ప్రతిపక్ష పార్టీ విషయానికొస్తే.. గడచిన రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామనే అంటారు! జగన్ కు ఎప్పుడు వీలైతే అప్పుడు యువభేరీ అంటారు, లేదా ఇంకేదో సమరం అంటుంటారు. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ అయ్యారు కూడా! ఈ సందర్భంలో తెలుగుదేశం ఎంత రచ్చ చేసిందో కూడా చూశాం. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకే ప్రధాని కాళ్లు పట్టుకునేందుకు జగన్ వెళ్లారంటూ నానా యాగీ చేశారు. ఆ తరువాతైనా, జగన్ ప్రత్యేక హోదా గురించి పోరాటాన్ని తీవ్రతరం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు కోసం ప్రధాని ఫోన్ చేయగానే ఓకే అనేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయేకు మద్దతు ఇస్తామని జగన్ ఎందుకు మెలిక పెట్టేదని టీడీపీ అప్పట్లో వాదించింది! నిజానికి, ఆ పనేదో వారు చెయ్యొచ్చు కదా. సంఖ్యాపరంగా చూసుకున్నా ఎమ్మెల్యేలు, ఎంపీల టీడీపీలోనే ఎక్కువగా ఉన్నారు.
ఏతావతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే… ప్రత్యేక హోదా అనేది కేవలం ఒక రాజకీయాంశం మాత్రమే! దానితో ముడిపడి ఉన్న ఆంధ్రా ప్రజల ప్రయోజనాలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు పట్టవు! పట్టి ఉంటే ఈ సందర్భంలో కేంద్రంపై పట్టు బిగించేవారు. ప్రజల ప్రయోజనాలే ప్రాధమ్యం అనుకుని ఉంటే అధికార ప్రతిపక్షాలు ఒకటై కేంద్రాన్ని నిలదియ్యొచ్చు. అలాంటి కలిసికట్టుతనం ఆశించడం అత్యాశ! మొత్తానికి, ప్రత్యేక హోదాపై కేంద్రం గుక్కతిరక్కుండా చేయగలిగే ఓ అవకాశాన్ని చంద్రబాబు, జగన్ లు విడివిడిగా జారవిడిచారు. రేప్పొద్దున్న ప్రత్యేక హోదా పోరాటాన్ని కొనసాగిస్తున్నామని జగన్ మళ్లీ చెబుతారు! దాన్ని మించిన ప్యాకేజీ తెచ్చామని చంద్రబాబూ మళ్లీమళ్లీ చెప్పుకుంటారు. జరగబోతున్నదీ ఇదే, ప్రజలు చూడబోతున్న చోద్యం కూడా ఇదే!