రైల్వే మంత్రి సురేష్ ప్రభు నిన్న లోక్ సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తారని అందరూ ఆశించారు కానీ ఆయన ఆ ఊసే ఎత్తలేదు. దానిపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అయన మంత్రులు దానిపై ఇంతవరకు స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. స్పందిస్తే ప్రజలను సంతృప్తి పరిచేందుకు మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసి ఉంటుంది. దాని వలన కేంద్రంతో, రాష్ట్రంలో బీజేపీతో విభేదాలు వస్తాయి కనుకనే మౌనంగా ఉండిపోయారని భావించవచ్చును.
అయితే ప్రతిపక్షాలకి అటువంటి ఇబ్బందులు ఏవీ లేవు కనుక అవి బాహాటంగానే మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం రైల్వే జోన్ హామీని కూడా నిలబెట్టుకోనందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తన పార్టీ నేతలకి, కార్యకర్తలకి పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన ఆరు నెలలోగా ఏర్పాటు చేయవలసిన రైల్వే జోన్ రెండేళ్ళు కావస్తున్నా ఏర్పాటు చేయకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం ప్రకటించారు. బీజేపీతో, కేంద్రప్రభుత్వంతో తన సంబంధాలను కాపాడుకోవడం గురించే చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు తప్ప దాని వలన రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
వైకాపా నేతలు కూడా ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తున్నారు కానీ మోడీ ప్రభుత్వం మీదనో లేక రైల్వేమంత్రి సురేష్ ప్రభు మీదనో కాదు..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద. ఆయన కేంద్రం మీద గట్టిగా ఒత్తిడి తేకపోవడం వలననే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు తప్ప కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తోందని నేరుగా ప్రధాని నరేంద్ర మోడి గట్టిగా ప్రశ్నించడం లేదు.
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరడానికి మొన్న డిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. రైల్వేమంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ పెడుతున్నప్పుడు, ఆ తరువాత కానీ జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడకుండా, వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకోవడం గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ఒకవేళ నేడోరేపో దాని గురించి మాట్లాడినా దానికీ ఆయన చంద్రబాబు నాయుడునే విమర్శించవచ్చును తప్ప నరేంద్ర మోడీ పేరు ఎత్తే సాహసం చేయలేరు.
ఈ విధంగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా తమ స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ, ఒకదానినొకటి నిందించుకొంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి తప్ప రాష్ట్రానికి ఇచ్చిన హామీలనన్నిటినీ అమలు చేసేలా కేంద్రం ఒత్తిడి చేయలేకపోతున్నాయి. రాష్ట్రంలో ఈ పరిస్థితులను చూసే కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించగలుగుతోందని చెప్పవచ్చును.