లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ గురువారం(డిసెంబర్14) నాడు పార్టీ ప్రతినిధి వర్గంతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.సురాజ్య యాత్ర సందర్భంగా 13 జిల్లాల్లో విద్యా వైద్య రంగాలపై జరిగిన పరిశీలన పలితాలు ప్రభుత్వానికి సమర్పించేందుకు వెళ్లినట్టు చెబుతున్నా అంతకు మించిన రాజకీయ ప్రాధాన్యత ఈ భేటీకి ఏర్పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాక జెపి కలవడం ఇదే తొలిసారి. ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు ఆయనను ఫోన్ చేసి ఆహ్వానించారు గాని ఆ రద్తీలో వెళ్లలేనని ముందే వెళ్లి మాట్లాడివచ్చారు. అదే తనకు గుర్తున్నంతవరకూ తమ చివరి కలయిక అని కొద్ది మాసాల కిందట జెపి నాతో చెప్పారు. ఆ పార్టీ నాయకులు కూడా తమ నేత సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు దగ్గరకు వెళ్తున్నట్టు ముందే చెప్పారు. అక్కడకు వెళ్లాక జెపి తమ పర్యటనపై వినతి పత్రంతో పాటు జిల్లాల పరిస్థితిపై ఒక పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారట. ఆ వెంటనే చంద్రబాబు సంబంధిత శాఖల మంత్రులను పిలిపించి ఏం చేస్తున్నది చెప్పించారట. తర్వాత జెపి మీడియాతో మాట్లడుతూ ఖర్చు పెంచకుండానే విద్య నాణ్యత పెంచడానికి ఏ అవకాశాలున్నాయో తాను నివేదించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి నిర్దేశించే లక్ష్యాల పూర్తికోసం మాస్ కాపీయింగ్ జరుగుతుందన్నారు. తమ నివేదికలోని నిజానిజాలు పరిశీలించి చంద్రబాబు తగు చర్యలు చేపడతారనే ఆశాభావం వెలిబుచ్చారు. ఏమైతేనేం- ఈ భేటీతో ఉభయ నేతల మధ్య మళ్లీ సంబంధాలు పున:ప్రారంభించుకున్నారన్నమాట.