హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడురోజుల పర్యటనకుగానూ రేపు సింగపూర్ బయలుదేరుతున్నారు. ఆయనవెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, పరకాల ప్రభాకర్, అధికారులుకూడా ఉంటారు. కొత్తగా ఎన్నికైన సింగపూర్ ప్రభుత్వాన్ని వచ్చే నెల 22న జరిగే అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించటంతోబాటు పెట్టుబడులను ఆహ్వానించటమే తమ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని సీఎమ్ చెబుతున్నారు. విదేశీ పర్యటనలు, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సింగిల్ విండో విధానంవల్ల పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడిదారులలో విశ్వాసం కలిగించగలుగుతున్నామని చెబుతూ తమ విదేశీ పర్యటనలను ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. ఏపీకి సహజసిద్ధంగా ఉన్న వెయ్యి కిలోమీటర్ల కోస్తా తీరంకూడా కలిసివచ్చే అంశమని చంద్రబాబు ఇవాళ విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. 21న సింగపూర్ వాణిజ్యవర్గాలతో ముఖ్యమంత్రి బృందం సమావేశమవుతుంది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనకు వెళ్ళటం ఇది మూడోసారి. ఇదికాకుండా చైనా, టర్కీ దేశాలలో కూడా చంద్రబాబు పర్యటించారు. ఈ విడత పర్యటనకు ఏపీ ఆర్థిక శాఖ రు.63 లక్షలను విడుదల చేసింది.