గ్రేటర్ ఎన్నికల కోసం ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తమ తమ పార్టీల తరపున చాలా జోరుగా ప్రచారం చేసారు. కానీ నిన్న జరిగిన పోలింగులో వారిద్దరూ తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. హైదరాబాద్ ఓటర్ల జాబితాలో చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి పేర్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తప్ప మిగిలిన ముగ్గురూ తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఆయన ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన ఓటరు చిరునామాని స్వగ్రామమయిన చిత్తూరులోని నారావారిపల్లెకు మార్పించుకొన్నారని అందుకే ఆయన ఓటు వేయలేదని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటుని తన స్వగ్రామమయిన చింతమడకలోనే ఉంచుకొన్నందున ఆయనకి గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు ఉండదు. కనుక ఓటు వేయలేదు. ఆయన కుమారుడు కె.టి.ఆర్.కి హైదరాబాదులో ఓటరుగా ఉన్నందున ఆయన తన ఓటు హక్కుని వినియోగించుకొన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తుని ఘటనలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం కేరళలో జరుగుతున్న తన సినిమా షూటింగ్ మధ్యలో ఆపుకొని మొన్న హైదరాబాద్ వచ్చేరు. కానీ ఓటు వేయకుండానే కేరళ తిరిగి వెళ్ళిపోయారు. ఆయన రాజకీయాలలో లేకపోయుంటే ఆయన ఓటు వేసినా వేయకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకొనేవారు కారు కానీ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉంటూ ఓటు వేయకపోవడం వలన విమర్శింపబడతారు.