ఏపీలో ప్రభుత్వం మారడంతో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ హాయాంలోని వైఎస్సార్ ఆసరా ఫించన్ పథకం పేరును తాజాగా కూటమి సర్కార్ మార్చింది. వైఎస్సార్ ఫించన్ పథకం పేరును తొలగించి ఎన్టీఆర్ భరోసా స్కీమ్ గా పేరు మార్చుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టిన వెంటనే సామాజిక ఫించన్ల సాయం పెంపుపై చంద్రబాబు సంతకం చేశారు. దీని ద్వారా వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్లకు 3 వేలు ఉన్న పెన్షన్ రూ.4 వేలకు పెరగనుంది.
అటు, దివ్యాంగులకు మూడు వేల పెన్షన్ ను ఆరు వేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. తాజాగా ఫించన్ల పెంపు నిర్ణయంతో వారికి ఇకపై పెన్షన్ ఆరు వేలు అందనుంది. పూర్తిస్థాయి దివ్యాంగుల పెన్షన్ను 5 వేల నుంచి 15వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారికి ఐదు వేల నుంచి 10వేలు పెన్షన్ అందించనున్నారు.