ఆంధ్రాకి ఇచ్చేదేం లేదని ఆర్థిక శాఖ వర్గాలు లీకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, సెంటిమెంట్లతో చేసే రాజకీయ ఒత్తిళ్లకు లొంగేది లేదని కూడా కేంద్రం అభిప్రాయపడింది. ఇంకోపక్క, భాజపాతో పొత్తు విషయమై సీఎం చంద్రబాబు స్పందిస్తే.. రాజీనామాలకు ఏపీ భాజపా నేతలు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రాపై కేంద్రం పరిపూర్ణ నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, రెచ్చగొట్టే ధోరణిలో కవ్వింపు చర్యలకు దిగుతున్నా… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయమనం పాటించారనడంలో సందేహం లేదు. ఆవేశాన్ని అణుచుకుంటూ, ఆవేదనను అర్థం చేసుకోవాలని కేంద్రాన్ని మరోసారి, బహుశా చివరిసారి అనొచ్చేమో.. ఇచ్చిన హామీలూ చేసిన చట్టాలను అమలు చేయాలంటూ ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం చంద్రబాబు అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. అంశాల వారీగా ఆంధ్రాకి కేంద్రం ఇచ్చినవీ ఇవ్వాల్సినవీ మరోసారి ప్రజలకు వివరించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ఇస్తామన్న ప్రయోజనాలు ఒక్కటీ ఇవ్వలేదు కాబట్టే, ఇప్పుడు హోదా కావాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం అన్నారు. పార్లమెంటు సాక్షిగా చేసిన విభజన చట్టాన్ని, ఆ రోజు రాజ్యసభలో ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని అడుగుతున్నామన్నారు. జీఎస్టీ తరహా పన్ను రాయితీలు ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారనీ, అదే తరహాలో ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సంయమనం పాటిస్తూ వస్తున్నామనీ, మాకు ఎవ్వరిపైనా కోపం లేదని సీఎం స్పష్టం చేశారు.
ఈ పార్లమెంటు సమావేశాల్లోనే, మరో రెండుమూడు రోజుల్లో ఏపీ చేస్తున్న 18 డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మోడిని ఇవ్వాలని కోరుతున్నవి తన వ్యక్తిగత డిమాండ్లు కావనీ, పదవులూ లాంటివి తాను అడగడం లేదన్నారు. అన్ని రాష్ట్రాలనూ కేంద్రం సమానంగా చూడాలనీ, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడాలని చంద్రబాబు అన్నారు. ఈ సభ ద్వారా, ఐదు కోట్ల ప్రజల తరఫున మళ్లీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాననీ, విభజన చట్టాన్ని గౌరవించి, దాన్లో అంశాలన్నీ అమలు చేయాలన్నారు. విభజన సమయంలో మీరు చెప్పిన, మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక హోదాను కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రుల మనోభావాలను గౌరవించాలన్నారు.
ఓ పక్క రాష్ట్ర భాజపా నేతలు, ఇంకో పక్క కేంద్రం… అందరూ రెచ్చగొట్టే విధంగా ఎన్ని ప్రకటనలు చేస్తున్నా, ఆగ్రహాన్ని అణుచుకుంటూ ఆవేదనను మాత్రమే చంద్రబాబు వ్యక్తీకరించారు. పొత్తు తెంచేసుకోవడం ఒక్క మాటతో జరిగిపోయే పని. కానీ, రాష్ట్ర ప్రయోజనాలనేవి రాజకీయాల కంటే ప్రాధాన్యత కలిగిన అంశం. అందుకే, ఆ సమతౌల్యం చంద్రబాబు ప్రసంగంలో అడుగడుగునా కనిపించింది. కేంద్రాన్ని చివరిసారిగా డిమాండ్ చేస్తున్నట్టు అనిపించింది.