తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రోజుకో తలనొప్పి వస్తోంది. తాను ఎంపిక చేసిన రాజధాని అమరావతిని ఎలాగైనా నిలబెట్టాలని పట్టుదలతో ఉన్న చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల వ్యతిరేకతకు నడుంబిగించారు. ఇందులో భాగంగా అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. గత ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీని పటిష్ట పరచడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు కళా వెంకట్రావు పనితీరుపై చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి నుంచి కళా వెంకటరావును తప్పించాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కిమిడి కళా వెంకట్రావు స్థానంలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకుడు కింజారపు అచ్చెన్నాయుడుకి అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు. ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖపట్నం పాలనా రాజధానిగా మారితే ఉత్తరాంధ్ర జిల్లాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గడ్డుగా మారుతుందని, దానిని ఎదుర్కోవాలంటే ఆ ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడుకు అధ్యక్ష పదవి కట్టబెట్టడం మంచి నిర్ణయమని పార్టీ సీనియర్ నాయకులు చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. కింజరాపు అచ్చెన్నాయుడుకు ఉత్తరాంధ్ర జిల్లాలలో మంచి ఫాలోయింగ్ ఉందని, తన అన్న దివంగత సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు పట్ల ఉత్తరాంధ్ర ప్రజలకు ఉన్న ప్రేమ, సానుభూతి అచ్చెనాయుడికి పనికివస్తాయని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఇక్కడి వరకు పరిస్థితి బాగానే ఉన్నా రాయలసీమలో పార్టీ పరిస్థితి దిగజారుతుందా అనే భయం చంద్రబాబు నాయుడుని వెంటాడుతోంది అంటున్నారు. దీనికి కారణం కర్నూలులో హైకోర్టు పెట్టడమేనని అంటున్నారు. రాయలసీమలో హైకోర్టు వస్తుండటం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే సీమలో ఉన్న సీనియర్ నాయకుడికి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పార్టీకి చెందిన సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పైగా గతంలో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకుడికి పార్టీ అత్యున్నత పదవిని కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు రాయలసీమ సీనియర్ నాయకులకు అన్యాయం చేశారనే వాదన ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకుడికి ఒకసారి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈసారి ఆ అవకాశాన్ని రాయలసీమ జిల్లాలకు చెందిన సీనియర్ నాయకుడికి ఇవ్వాలని సీమ జిల్లాల నాయకులు పట్టుబడుతున్నారు. అమరావతి రాజధాని తరలింపు పై తలనొప్పిగా మారిన చంద్రబాబు నాయుడుకు పార్టీ అధ్యక్ష పదవి కూడా కొత్త తలనొప్పులు తీసుకు వస్తోందని పార్టీలో చర్చ జరుగుతోంది.